● ఎక్స్‌రే నుంచి ఎమ్మారై వరకు వ్యాధుల గుర్తింపులో ప్రముఖ పాత్ర
● నేడు రేడియాలజీ దినోత్సవం
నెల్లూరు(అర్బన్): మెదడులో రక్తం గడ్డకట్టడం, నరాలు సన్నబడడం, రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల్లో సమస్య, పొట్టలో గడ్డలుండడం వంటి సమస్యలను గుర్తించడం, వ్యాధి ఏ రకమో తెలియజేయడంలో రేడియాలజీ విభాగం కీలకపాత్ర పోషిస్తోంది. ఆధునిక వైద్యంలో ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి అత్యాధునిక పరీక్షలను పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేసే రేడియాలజిస్టుల సేవలను గుర్తు చేసుకుంటూ ఆదివారం ప్రపంచ రేడియాలజీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.
ప్రతి విభాగానికీ ముఖ్యమే
ప్రమాదాల్లో ఎముకలు విరిగినప్పుడు, మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు, గుండె సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు, కేన్సర్ వ్యాధి నిర్ధారణ, వ్యాధి వ్యాప్తి అంచనా, చికిత్స తర్వాత వ్యాధి తీవ్రతను అంచనా వేయడం ఇలా ప్రతి విభాగంలో రేడియాలజిస్ట్‌లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గతంలో సాధారణ ఎక్స్‌రేలకే పరిమితమైన వైద్య ఇమేజింగ్ నేడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. 3డీ ఇమేజింగ్, హైరెజల్యూషన్ అల్ట్రా సౌండ్, అధునాతన ఎమ్మారై, పెట్, డిజిటల్ పెట్ వంటి పరీక్షలు వ్యాధులను మరింత స్పష్టంగా గుర్తిస్తున్నాయి.
అవసరం లేకుండా పరీక్షలొద్దు
కొంతమంది అతి జాగ్రత్తల్లో భాగంగా సీటీస్కాన్, ఎక్స్‌రేలు చేయించుకుంటున్నారు. సీటీ స్కాన్‌లో ఉన్న అయోనైజింగ్ రేడియేషన్ వల్ల కొన్ని ప్రమాదాలు వస్తాయి. అందువల్ల వైద్యుల సూచన మేరకే పరీక్షలు చేయించుకోవాలి.
జిల్లాలో రేడియాలజిస్ట్‌ల కొరత
జిల్లాలో ప్రభుత్వ రంగంలో పరిశీలిస్తే సర్వజన ఆస్పత్రిలో రేడియాలజీ విభాగం ఉంది. ఇక్కడ నలుగురు అసిస్టెంట్లు, ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌తో పాటు మరో ప్రొఫెసర్ ఉన్నారు. ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో రెగ్యులర్ రేడియాలజిస్ట్ ఒకరు, గూడూరులో ఒకరున్నారు. కావలిలో రెగ్యులర్ రేడియాలజిస్ట్ లేరు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసి సకాలంలో రిపోర్టులు ఇచ్చేందుకు తగినంత మంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటుగా పరిశీలిస్తే కూడా రేడియాలజిస్ట్‌లు తగినంత మంది లేరు. 175 కేంద్రాలలో రేడియాలజిస్ట్‌లు పని చేస్తున్నారు. రోగులకు సకాలంలో రిపోర్టులు ఇవ్వాలంటే వీరి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎమెర్జెన్సీ రోగులకు సకాలంలో రిపోర్టులు ఇవ్వకపోతే వైద్యం కూడా సక్రమంగా జరగదు.
ఉచితంగా ఖరీదైన సేవలు
కీలకమైన పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చేది రేడియాలజిస్ట్‌లు మాత్రమే. ఆ రిపోర్ట్‌ల ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఖరీదైన ఎమ్మారై, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే లాంటి ఖరీదైన సేవలు ఉచితంగా అందుతున్నాయి.
– డాక్టర్ వి.కుసుమ,
రేడియాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, నెల్లూరు


