● డీఏఓ సత్యవాణి
నెల్లూరు(వేదాయపాళెం): ప్రతి పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి(డీఏఓ) పి.సత్యవాణి తెలిపారు. నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో సుస్థిర జీవనశైలి వారోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడు రోజులుగా తమ కార్యాలయ అధికారులు, సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అవసరమైన పలు అంశాలను వివరించామని తెలిపారు. విద్యుత్ ఆదా, నీటి సంరక్షణ, సుస్థిర ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడం, సింగిల్‌యూజ్డ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతానని, ప్రకృతి సమతుల్యతను కాపాడుతామని సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సుజాత, సునీత, రాధా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


