చిల్లకూరు: గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శనివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. ఇక్కడ గూడూరు, వెంకటగిరి నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పోటీ చేసిన అభ్యర్థులందరూ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో ముందుగా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను లెక్కింపు ప్రక్రియను తనిఖీ చేశారు. అలాగే కలెక్టర్ హిమాన్షు శుక్లా కూడా కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు. ఈ సందర్భంగా చిల్లకూరు మండలం తమ్మినపట్నం సెగ్మెంట్ ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యమవుతోందని, దీనిపై ఏమైనా రీకౌంటింగ్ చేపడుతారా అని ప్రశ్నించడంతో ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. గూడూరు ఆర్డీఓ అరుణకుమారి, డీఎస్పీ నరసింహమూర్తి ఉన్నారు.


