నెల్లూరు(క్రైమ్): జిల్లాలో గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. రెండు వేల మందికిపైగా పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఎస్పీ నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 1,639 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 2,800 మందికి పైగా ట్రబుల్ మాంగర్లను బైండోవర్ చేశామన్నారు. అక్రమ మద్యం సరఫరా, నగదు పంపిణీ ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
● చేజర్ల, కలువాయి, రాపూరు తదితర ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. సామగ్రి తరలింపు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట పోలీసు అధికారులున్నారు.


