నెల్లూరు(పొగతోట): పరిషత్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ అడ్డదారులు తొక్కేందుకు వ్యూహాలు రచించింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడా అమలు చేస్తోంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే సీసీ కెమెరాలు పెట్టి చేతులు దులుపుకోవడం వెనుక అల్లర్లు, బూత్‌ల ఆక్రమణలు, రిగ్గింగ్‌లు చేసేందుకేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మున్సిపాలిటీల్లో కంటే.. గ్రామీణ ప్రాంతాల్లోనే రాజకీయ కక్షలకు ఆస్కారం ఉంటుంది. అటువంటి సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టకపోవడంపై సుప్రీం ఆదేశాలను ధిక్కరించడమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. నామినేషన్లు, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రతి ప్రక్రియను సుప్రీం కోర్టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజుకు వాటిని తొలగించి సుప్రీం ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కారు. అధికార పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్న సెగ్మెంట్లల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోయినా ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలుగా ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో 78 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.
దశల వారీగా కుట్రలు
కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దశల వారీగా కుట్రల వ్యూహాన్ని అమలు చేసింది. మొదట నామినేషన్ల ప్రక్రియలో.. రెండో దశలో నామినేషన్ల ఉపసంహరణలో బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం, వినకపోతే నామినేషన్లు అధికారికంగా విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించి అధికార పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవమైనట్లు ప్రకటించడం. అనివార్యంగా పోలింగ్ జరిగినా.. రిగ్గింగ్‌లు, సైక్లింగ్ ఓటింగ్, కౌంటింగ్‌లోనూ కుట్రలు చేసింది. సంగం, చేజర్ల, మర్రిపాడు, ఏఎస్‌పేట, ఎస్‌ఆర్‌పురం, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కొడవలూరు, చిల్లకూరు తదితర మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు వారికి తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవమైనట్లు ఆర్వోల ద్వారా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున జిల్లాలోనే లేనటువంటి వారి సంతకాలు పెట్టి నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారని ఆర్‌ఓలు అడ్డగోలుగా పనిచేశారు. ఈ విషయంపై కలెక్టర్ హిమాన్షుశుక్లాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. రూ.కోట్ల డబ్బులు కుమ్మరించి 5 జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారు. మూడోవది పోలింగ్ రోజు రిగ్గింగ్ చేయడం. దొంగ ఓట్లు వేయడం, కౌంటింగ్ రోజున ఉద్యోగులు తారుమారు చేశారు.
జిల్లాలో 1568 పోలింగ్ కేంద్రాలు
585 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు
గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ కక్షలకు ఆస్కారం ఎక్కువ
ఇప్పటికే నామినేషన్ల పర్వం నుంచి అల్లర్లు
మునిసిపల్ ఎన్నికల సూత్రాన్ని పరిషత్ ఎన్నికల్లో అమలుకు సన్నాహాలు
ప్రశాంత జిల్లాలో అల్లర్లు
నెల్లూరు జిల్లాకు ప్రశాంత జిల్లా అని ప్రత్యేక పేరు ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంతత దూరమైంది. కుట్రలు, బెదిరింపులు, హౌస్ అరెస్ట్‌లు, ఇతర కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎక్కడో ఒకటి, రెండు చోట్ల మినహా ఎన్నికల సమయంలో గొడవలు, అల్లర్లు జరిగేవి కావు. ప్రస్తుతం దౌర్జన్యాలు, కేసులు పెట్టడం, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం, పోటీ చేసిన అక్రమ మర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేయడాలు జరుగుతున్నాయి.


