● ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎలక్షన్లలో అరాచకాలకు టీడీపీ పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైనాన్ని ప్రజలు మరువలేరని.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనైనా సజావుగా నిర్వహించేలా ఎన్నికల సంఘం, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్యతో కలిసి విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రలోభాలకు లొంగక పోరాడిన తమ పార్టీ శ్రేణులు, పార్టీ అభ్యర్థులు, బూత్ కమిటీల సభ్యుల సేవలు, అంకితభావాన్ని గుర్తుంచుకుంటామని వివరించారు. ఆత్మకూరు సీటును తొలుత బీసీ జనరల్‌గా నిర్ధారించారని, అయితే టీడీపీకి అభ్యర్థే దొరకని క్రమంలో వారి అధికార బలంతో ఓసీ మహిళకు కేటాయించారని చెప్పారు. అయినా అదే పరిస్థితి నెలకొనడంతో బొమ్మిరెడ్డి కుటుంబంలో చీలికతెచ్చి ఆ ఇంటి మహిళను పోటీకి దింపిన నీచచరిత్ర రామనారాయణరెడ్డికే దక్కుతుందని విమర్శించారు. అనేక అడ్డంకులను సృష్టించి నామినేషన్లు వేయనీయకుండా ఎన్వోసీలు ఇవ్వకపోవడం, వేసిన వాటిని అక్రమంగా విత్‌డ్రా చేయించడం తదితరాలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కౌంటింగ్ సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లో 60 బ్యాలెట్ బాక్సులను భద్రపర్చగా, వాటిలో 41కే సీల్ వేశారని చెప్పారు. మిగిలిన 19 ఖాళీగా ఉన్నాయని.. తమ ప్రతినిధులు పరిశీలిస్తే వాటిలో కొన్ని చోట్ల బ్యాలెట్లు కనిపించాయని.. వీటిపై ప్రశ్నించగా ఆర్వో, మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్పారని ఆరోపించారు. ఇన్ని జరిగినా తమ శ్రేణులు వెనక్కి తగ్గకుండా నిలిచి పది సీట్లను సాధించారని, రెండు చోట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. మిత్రపక్షమైన సీపీఎం ఒక సీటును సాధించడాన్ని అభినందించారు. ప్రలోభాలకు గురిచేసి బెదిరింపు ధోరణితో వ్యవహరించి 30 ఎంపీటీసీ సెగ్మెంట్లను ఏకగ్రీవం చేసుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. నేతలు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, న్యాయవాదుల సంఘ కన్వీనర్ నందా ఓబులేసు, కల్పనారెడ్డి, పర్వీన్, ముజీబ్, జమ్రు, బాలఅంకయ్య, వెంగళ్‌రెడ్డి, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


