● నామినేషన్ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు కొనసాగింపు
● అభ్యర్థులకు బెదిరింపులు, ప్రలోభాలు, బలవంతపు విత్‌డ్రాలు
● అధికార అండ.. పోలీసుల తోడుతో పచ్చనేతల పన్నాగాలు
● ఓటర్లు, ఏజెంట్లకు నోట్ల ఎర
● ప్రజాక్షేత్రంలో గెలవలేమని
అడ్డదారులు
● పోలింగ్ రోజున విధ్వంసానికి స్కెచ్?
● నిఘా కెమెరాల్లేకుండా ఎన్నికల
నిర్వహణపై ఆందోళన
● సుప్రీంకోర్టు ఆదేశాలున్నా
వెబ్ కెమెరాలు కరువు
● నేడు మున్సిపల్ వార్
గెలుపు కోసం దశదిశల కుట్రలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతతో స్థానిక సంస్థల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతల అరాచకాలతో ప్రజాతీర్పుపై పచ్చ పంజా విసురుతోంది. మున్సిపల్ వార్‌లో గెలుపే లక్ష్యంగా పచ్చ నేతలు దశ కుట్రలు పన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచే ధైర్యం లేక అధికార దర్పం, పోలీసు బలగం, ప్రలోభాల అస్త్రాలతో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం నుంచే మొదలైన కుట్రల పర్వం అభ్యర్థులకు బెదిరింపులు, ప్రలోభాలు, బలవంతపు ఉపసంహరణలతో పతాక స్థాయికి చేరింది. ఓటర్లను, పోలింగ్ ఏజెంట్లను నోట్ల కట్టలతో కొనుగోలు చేసేందుకు తెరవెనుక పన్నాగాలు పన్నారు. పోలింగ్ రోజున బూత్‌ల ఆక్రమణలు, దాడులు, విధ్వంసాలకు రంగం సిద్ధం చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. మరో వైపు సుప్రీంకోర్టు ఆదేశాలున్నా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాల ఏర్పాటుపై నిర్లక్ష్యం ఎన్నికల పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.
ఆఖరి ఘట్టానికి పుర పోరు
జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోలింగ్ రోజు ప్రతి బూత్‌ను తమ గుప్పెట్లోకి తీసుకుని ఓటర్లు ఓటువేసేందుకు రాకుండా గంజాయి, కిరాయి మూకలతో కలిసి భారీ విధ్వంసానికి స్కెచ్ వేసింది. శాంతిభద్రతలను పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ యంత్రాంగం, కెమెరాల నిఘా నీడలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సిన ఎన్నికల అధికార యంత్రాంగం అందుకు భిన్నంగా, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి టీడీపీ అరాచక శక్తులకు అభయం కల్పిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూటమి నేతలు పాగా వేశారు.
కుట్రలు ఇలా..
ప్రజాక్షేత్రంలో ఓటమి భయంతో పదవులను ప్రజాతీర్పునకు భిన్నంగా, ఎన్నికల ప్రక్రియకు విరుద్ధంగా దక్కించుకునేందుకు అధికార పార్టీ దశదిశల అనేక కుట్రలకు తెరలేపింది. నామినేషన్ల పర్వంతోనే దశ కుట్రలో మొదటి భాగం అమలు చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి నామినేషన్లు వేసే వారి వివరాలు సేకరించి నామినేషన్లు దాఖలు చేయొద్దని పార్టీ నేతలతో బెదిరింపులు, తర్వాత పోలీస్ అధికారులతో వార్నింగ్‌లిచ్చారు. అయినా వారి బెదిరింపులను లెక్కచేయకుండా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైతే.. కర్రలు, రాడ్లతో చెలరేగిపోయి పత్రాలు చించివేయడంతో అరాచక పర్వంలో రెండో అంకానికి తెరతీశారు.
నామినేషన్ల స్క్రూటీని ఘట్టం
టీడీపీ నేతల అరాచక పర్వాన్ని ఎదిరించి నామినేషన్లు దాఖలు చేసినా పరిశీలన కార్యక్రమంలో కొందరు అధికారులు పచ్చచొక్కాలు తొడిగి సిల్లీ రీజన్స్ చూపి స్క్రూటీనిలో ప్రధాన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని, కేవలం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మాత్రమే తప్పులు జరిగినట్లు చూపి రిజెక్ట్ చేయించారు.
విత్ డ్రాలో..
దశ కుట్రలో మూడో భాగమైన నామినేషన్ల విత్ డ్రాలో వింతపోకడలు చూపించారు. అభ్యర్థులను నయానో, భయానో భయపెట్టి విత్‌డ్రాలు చేయించారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు తెలియకుండానే వారి ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రాలు చేసి చరిత్రలో మరో కొత్త అధ్యయాన్ని లిఖించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 8, ఆత్మకూరులో ఒకటి, బుచ్చిరెడ్డిపాళెంలో ఐదు వార్డులు ఏకగ్రీవం చేయించారు. సాక్షాత్తు పోలీస్ అధికారి వాహనంలోనే డబ్బు సంచులు పెట్టి వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వల వేసిన ఘటన కూడా సంచలనంగా మారింది.
ప్రచారంలో పాల్గొన్నా.. బెదిరింపులు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార ఘట్టంలో అభిమానంతో పాల్గొన్న వారిపై బెదిరింపులు పర్వం కొనసాగించారు. ఎవరైనా పార్టీలో యాక్టివ్‌గా ఉంటే వారిని పిలిపించి బెదిరించి పంపడం అరాచక ఘట్టంలో ఇదొక అంకం.
ఓటుకు నోటు
నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ నేతల బరితెగించారు. ఓటుకు నోటు కార్యక్రమంలో మంత్రి నారాయణ తన ప్రత్యేక టీఎంను దాదాపు వెయ్యి మందిని రంగంలోకి దించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రతి ఓటుకు రూ.2 వేలు వంతున పబ్లిక్ గానే పంపిణీ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటుకు రూ.వెయ్యి వంతున పంపిణీ చేశారు.
చివరి ప్రయత్నంగా అరాచకం
ఎన్నికల్లో ప్రజాతీర్పు అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తుందనే సమాచారం బయటకు వస్తే.. చివరి ప్రయత్నంగా పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకాలతో అలజడులు సృష్టించి ఓటర్లు భయభ్రాంతులకు గురి చేసి బూత్‌లను ఆక్రమించి, రిగ్గింగ్ చేసేందుకు కూడా వెనుకాడని పరిస్థితి ఉందని నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న కొందరు ఎన్నికల, పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఏజెంట్లకు బెదిరింపులు
ఎన్నికల ఘట్టంలో ప్రధాన అంశం ఏజెంట్ల నియామకం వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల జాబితాను అధికారుల నుంచి తీసుకున్న టీడీపీ నేతల వారిని ప్రలోభాలు, బెదిరింపులతో వారిని మచ్చిక చేసుకుని పోలింగ్ కేంద్రాల్లో సైక్లింగ్ రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


