నెల్లూరు(పొగతోట): పురపాలక ఎన్నికల తరుణంలో స్లిప్పుల కోసం ఓటర్లకు తిప్పలు తప్పడంలేదు. వాస్తవానికి వీటిని అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. బీఎల్వోలొచ్చి వీటిని పంపిణీ చేస్తారని చెప్పినా, సగానికిపైగా ఓటర్లకు ఇవి అందలేదు. విభజనతో డివిజన్ల సరిహద్దులు మారిపోవడంతో తమ ఓటు ఎక్కడుందో అర్థం కాక పలువురు అయోమయానికి గురవుతున్నారు. సచివాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించినా, సిబ్బంది అందుబాటులోకి రాలేదు. మరోవైపు కూటమి నేతలకు అనుకూలంగా ఉండే వారికి అందజేసి.. ఇతరులకు పంపిణీ చేయడంలో బీఎల్వోలు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ఎంపీడీఓ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయనున్నామని జెడ్పీ సీఈఓ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రక్రియకు జిల్లాలో 11 వేల మంది ఉద్యోగులను నియమించామని వివరించారు. ఆదివారం నుంచి ఈ నెల నాలుగు వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు వీటిని అందజేయనున్నామని చెప్పారు. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన కాపీని తీసుకెళ్లాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించి అక్కడే ఏర్పాటు చేసిన బాక్సులో వేయాలని సూచించారు.
●జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార వాహనాలు, మైక్, సభలు, ర్యాలీలకు అనుమతులను తహసీల్దార్ కార్యాలయాల్లో మంజూరు చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాల్లో అనుమతులిచ్చే విధానాన్ని నిలిపేశారని చెప్పారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు.
కండలేరులో
16.76 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 16.76 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు ఐదు, మొదటి బ్రాంచ్ కాలువకు ఏడు క్యూసెక్కుల ను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.


