పురపోరుకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పురపోరుకు సర్వం సిద్ధం

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

జిల్లాలో ఇలా..
మూడున లెక్కింపు

● నేడు పోలింగ్‌

● ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు

● కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు

నెల్లూరు(బారకాసు): ఎప్పుడెప్పుడానని నిరీక్షిస్తున్న పురపోరు ఆదివారం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రచార గడువు శుక్రవారంతో ముగియడంతో ఓటర్లను అభ్యర్థులు కలుస్తున్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు విందులతో పాటు తాయిలాలు అందిస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

భారీ భద్రత

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ పరిధిలోని 72 డివిజన్లలో 148 పోలింగ్‌ స్టేషన్లలో 509 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైన 162 బూత్‌లలో 324 సీసీ కెమెరాలను అమర్చారు. వాస్తవానికి అన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్‌ఈసీ సూచనల మేరకు అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లోనే నెలకొల్పారు. ఇవి లేని చోట గొడవలు, హింసాత్మకమైన ఘటనలు జరిగితే పరిస్థితేమిటనే అభిప్రాయం ఓటర్లలో వ్యక్తమవుతోంది.

బ్యాలెట్‌ బాక్సుల తరలింపు

బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలను పోలీస్‌ భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు.. అక్కడ్నుంచి పోలింగ్‌ కేంద్రాలకు శనివారం రాత్రి తరలించారు. పోలీస్‌ బలగాలను మోహరించారు. ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

4351 మంది ఎన్నికల సిబ్బంది

పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా 4351 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 713 మంది పీఓలు, 713 మంది ఏపీఓలు, 2851 మంది ఇతర పోలింగ్‌ అధికారులు, 74 మంది మైక్రో అబ్జర్వర్లున్నారు. నెల్లూరులో 3720.. ఆత్మకూరులో 230.. బుచ్చిరెడ్డిపాళెంలో 401 మంది సిబ్బందిని విధులకు కేటాయించారు.

పటిష్ట బందోబస్తు

జిల్లా వ్యాప్తంగా 1725 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇందులో 31 మంది సీఐలు, 88 మంది ఎస్సైలు, 346 మంది ఏఎస్సై / హెడ్‌కానిస్టేబుళ్లు, 897 మంది కానిస్టేబుళ్లు, 363 మంది హెడ్‌ కానిస్టేబుళ్లున్నారు.

115 వాహనాల ఏర్పాటు

ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్‌ సిబ్బంది తరలింపు తదితరాలకు గానూ 115 వాహనాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థకు 15 కార్లు, 70 బస్సులు.. ఆత్మకూరుకు పది కార్లు, ఏడు బస్సులు.. బుచ్చిరెడ్డిపాళేనికి ఎనిమిది కార్లు, ఐదు బస్సులను కేటాయించారు.

తాయిలాలిస్తూ..

మహిళలకు చీరలు.. మందుబాబులకు లిక్కర్‌ పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు అందజేశారు. ఉద్యోగులు, కుల సంఘాలకు ఆఫర్లిస్తూ మద్దతివ్వాలని అభ్యర్థిస్తున్నారు. వలస ఓటర్లను రప్పించేందుకు యత్నిస్తున్నారు. వారికి అవసరమైన రవాణా ఖర్చులను తామే భరిస్తామంటూ.. వాహన సౌకర్యాలనూ కల్పిస్తున్నారు.

నెల్లూరు కార్పొరేషన్లో 2,37,972 మంది పురుషులు.. 2,51,293 మంది మహిళలు.. 86 మంది ఇతరులు కలిపి మొత్తం 4,89,351 మంది ఓటర్లున్నారు. 72 డివిజన్లలో ఎనిమిది ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. 217 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలో 28 వార్డులు.. 30 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 12,654 మంది పురుషులు.. 13,875 మంది మహిళలు కలిపి మొత్తం 26,529 మంది ఓటేయనున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీ పరిధిలో 28 వార్డులు.. 55 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 17,683 మంది పురుషులు.. 18,753 మంది మహిళలు, ఇతరులు రెండు కలిపి మొత్తం 36,438 మంది ఓటర్లున్నారు.

కౌంటింగ్‌ను మంగళవారం నిర్వహించి, అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. గెలిచిన వారితో నిర్ణయించిన తేదీన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement