ఖాకీలను దొంగలుగా మారుస్తున్న బాబు | - | Sakshi
Sakshi News home page

ఖాకీలను దొంగలుగా మారుస్తున్న బాబు

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

● సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు కుటుంబసభ్యులకు మద్దిల,

బూదూరుతో కలిసి పరామర్శ

చిట్టమూరు: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలను నేడు దొంగలుగా సీఎం చంద్రబాబు మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని యాకసిరిలో గల కృష్ణమనాయుడు కండ్రిగలో పార్టీ మండల కన్వీనర్‌ సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కుటుంబసభ్యులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి శనివారం పరామర్శించిన అనంతరం కాకాణి మాట్లాడారు. తమ పార్టీ నేతల ఇళ్ల వద్ద గంజాయి, మద్యం సీసాలను దొంగతనంగా ఉంచి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ఇలాంటి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉండే గూడూరు నియోజకవర్గాన్ని రావణకాష్టంలా మార్చేలా సైకిల్‌ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో తమ పార్టీతో తలపడలేక, పోలీసులను అడ్డదారుల్లో ఉపయోగించుకొని ఎక్కడిక్కడ అక్రమ కేసులు బనాయించి నేతలను జైళ్లకు పంపేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. గూడూరులో ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అట్ల సంపూర్ణమ్మ ఇంటి వద్ద మద్యం బాటిళ్లను అర్ధరాత్రి పోలీసులే పెట్టి అక్రమ కేసులను బనాయించారని మండిపడ్డారు. సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ఎవరో పిర్యాదు చేశారంటూ ఏకంగా హత్యాయత్నం కేసును నమోదు చేసి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలను తిరుపతి ఎస్పీ బెదిరిస్తూ.. అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. టీడీపీ అరాచకాలకు అడ్డుకట్టేసేలా తమ పార్టీని గెలిపించాలని కోరారు.

రణరంగంగా మార్చారు..

ప్రశాంతంగా జరగాల్సిన పరిషత్‌ ఎన్నికలను రణరంగంగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని గురుమూర్తి దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలోనే వర్గాలుంటాయని, ఆ తర్వాత అందరూ కలసికట్టుగా ఉంటారని, అయితే వీరి మధ్యలో కక్షలు.. కార్పణ్యాలను పెంచి పోషిస్తూ శకుని ప్రాతను పోషిస్తున్నారని మండిపడ్డారు. సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసిన వారిని.. దీని వెనుకున్న వారిని.. ప్రోత్సహించిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకు పాలనను సాగించకుండా.. లోకేశ్‌ కోసం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేశారన్నారు. పేదలు తమ సంపాదన మొత్తాన్నీ బెల్టుషాపుల్లోనే ధారపోస్తున్నారని చెప్పారు. అనంతరం గురవయ్య మాట్లాడారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్న దమనకాండకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లో ఉన్నాయని పేర్కొన్నారు. నేతలు కామిరెడ్డి కస్తూరిరెడ్డి, చెన్నారెడ్డి బాబురెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి సన్నారెడ్డి విజయలక్ష్మి, బద్దిగ వెంకటరమణయ్య, రాజీవ్‌రామిరెడ్డి, గొట్టిపాటి రవీంద్రరెడ్డి, మారంరెడ్డి రఘునాథ్‌రెడ్డి, కామిరెడ్డి రమేష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చెన్నూరు శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement