బకింగ్‌హామ్‌ కెనాల్‌ గట్టుపై రియల్‌ దందా | - | Sakshi
Sakshi News home page

బకింగ్‌హామ్‌ కెనాల్‌ గట్టుపై రియల్‌ దందా

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

బకింగ్‌హామ్‌ కెనాల్‌ గట్టుపై రియల్‌ దందా

కోవూరు: అవకాశం దొరికితే చాలు.. నిబంధనలను పక్కనపెట్టి ప్రభుత్వ ఆస్తులనే సొంత అవసరాలకు వినియోగించుకున్న పరిస్థితి ఇందుకూరుపేట మండలంలోని కృష్ణాపురం సముద్ర తీరంలో వెలుగుచూసింది. తాజాగా సముద్ర రియల్‌ ఎస్టేట్‌ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్‌ చుట్టూ బకింగ్‌హామ్‌ కెనాల్‌ గట్టు ఆక్రమణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీటిపారుదల శాఖ నుంచి తాత్కాలికంగా పొందిన అనుమతులను ఆసరాగా చేసుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదులు అధికార యంత్రాంగాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. కెనాల్‌ గట్టుపై బీటీ రోడ్డు నిర్మాణం, భద్రత కోసం అవుట్‌పోస్టు ఏర్పాటు తదితర అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), లోకాయుక్తతోపాటు ఉన్నత న్యాయస్థానాల దృష్టికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు హడావుడిగా కొన్ని నిర్మాణాలను తొలగించడం చర్చనీయాంశమైంది.

శాశ్వత నిర్మాణాలు చేపట్టి..

కెనాల్‌ గట్టును వినియోగించుకునేందుకు ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు నీటిపారుదల శాఖ తాత్కాలిక అనుమతులు మాత్రమే ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. అయితే ఆ అనుమతుల పరిధిని దాటి బీటీ రోడ్డు, సెక్యూరిటీ అవుట్‌పోస్టు వంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. తాత్కాలిక అనుమతులను శాశ్వత హక్కులుగా భావించి ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో లోకాయుక్త జిల్లా అధికార యంత్రాంగాన్ని సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో స్పందించిన అధికారులు సంబంధిత నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల కృష్ణాపురం తీర ప్రాంతాన్ని పరిశీలించి సెక్యూరిటీ అవుట్‌పోస్టు గదితోపాటు రహదారికి అనుబంధంగా ఏర్పాటు చేసిన మైలు రాళ్లను తొలగించారు. అయితే ప్రధానంగా వివాదానికి కారణమైన బీటీ రోడ్డు నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.

సుప్రీంకోర్టుకు చేరిన వివాదం

ఈ వ్యవహారంపై వాయుగండ్ల కార్తీక్‌ అనే వ్యక్తి లోకాయుక్తతోపాటు కేంద్ర జల సంఘానికి, సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు చేశాడు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రచారాన్ని నమ్మి జీవితకాల సంపాదనతో ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులకు చివరకు ఇబ్బందులు ఎదురైతే బాధ్యత ఎవరిది?, అనుమతులు ఉన్నాయంటూ విక్రయాలు చేపట్టి, రహదారి విషయంలో వివాదాలు తలెత్తితే కొనుగోలుదారులకు న్యాయం ఎలా జరుగుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణాపురం తీరంలోని సముద్ర రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దష్టి సారించి రెవెన్యూ, నీటిపారుదల, నుడా శాఖలతో సంయుక్త విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం కొన్ని నిర్మాణాలు తొలగించి నివేదికలు సమర్పించడం కాకుండా.. లేఅవుట్‌ అనుమతుల నుంచి ప్రభుత్వ భూముల వినియోగం వరకు ప్రతి అంశాన్ని నిగ్గు తేల్చాలని, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాత్కాలిక అనుమతుల మాటున శాశ్వత నిర్మాణాలు

‘సముద్ర’ రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

ఫిర్యాదులతో కదిలిన

అధికార యంత్రాంగం

హడావుడిగా తొలగింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement