● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఇంటి నుంచి బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యానికి చేరలేదు.
మృత్యువు రోడ్డు ప్రమాదాల రూపంలో
కబళించింది. జిల్లాలోని వేర్వేరు
ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో
ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొని..
నెల్లూరు సిటీ: ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన నెల్లూరులోని పార్థసారథి నగర్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మాదరాజుగూడూరుకు చెందిన నెల్లూరు మస్తానయ్య (70) గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సరుకులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు నెల్లూరుకు వచ్చాడు. కొనుగోలు అనంతరం తన మోటార్‌బైక్‌పై ఊరికి వెళ్తున్నాడు. ఉదయం 5:30 గంటల సమయంలో నెల్లూరు – ముత్తుకూరు రహదారిలో పార్థసారథి నగర్ సమీపంలోని మద్యం షాప్ వద్ద రోడ్డుపై సూచిక లైట్లు వేయకుండా, హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన ఇసుక లోడ్ ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మస్తానయ్యకు తీవ్ర తలగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రూరల్ ఎస్సై లక్ష్మణరావు కేసు నమెదు చేశారు.
కారు అదుపుతప్పి..
వరికుంటపాడు: మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన ఐదుగురు వ్యక్తులు జేసీబీ కొనుగోలు నిమిత్తం కారులో శ్రీకాకుళం బయలుదేరారు. 565వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరి (32) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై కె.మధుసూదన్‌రావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.


