ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా

Oct 31 2026 12:01 AM | Updated on Oct 31 2026 12:01 AM

● మౌలిక వసతుల కల్పనకు పెద్దపీటేస్తాం

● టీడీపీ హయాంలో అన్నీ సమస్యలే

● బుచ్చి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షకీలా బేగం

కోవూరు: ప్రజా సమస్యల పరిష్కారమే తమ అజెండా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షకీలా బేగం పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక సమస్యలు తాండవిస్తున్నాయని, ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఇదే అంశాలను ప్రజలకు తమకు తెలియజేస్తున్నారని వివరించారు. ఆమెతో సాక్షి శుక్రవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.

ప్రశ్న: ఎన్నికల ప్రచారమెలా సాగుతోంది..?

సమాధానం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను పార్టీ శ్రేణులు కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ.. పార్టీ విధానాలు, గతంలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నాం. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరిస్తామనే భరోసాను కల్పిస్తున్నాం.

ప్రశ్న: ఏ అంశాలను ప్రధానంగా

తీసుకెళ్తున్నారు..?

సమాధానం: ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. తమ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రస్తుత సర్కార్‌ అవలంబిస్తున్న తీరును తెలుసుకుంటున్నాం. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధికి ఏమి చేయాలనే అంశంపై చర్చిస్తున్నాం.

ప్రశ్న: ఎలాంటి అంశాలను

మీ దృష్టికి తీసుకొస్తున్నారు..?

సమాధానం: వార్డుల్లో పర్యటిస్తున్న సమయంలో అనేక సమస్యలను ప్రజలు తెలియజేస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్యంపై ఎక్కువగా వివరిస్తున్నారు. ప్రజలు ప్రస్తావించిన ప్రతి సమస్యను నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేసేందుకు యత్నిస్తాం.

ప్రశ్న: శ్రేణుల మధ్య

సమన్వయమెలా ఉంది..?

సమాధానం: ఎన్నికల సమయంలో శ్రేణులందరూ సమన్వయంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమావేశాలను మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నిర్వహిస్తూ స్థానిక పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అభ్యర్థులకు అవసరమైన సహకారాన్ని అందిస్తూ.. ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తున్నాం.

ప్రశ్న: భవిష్యత్తులో చేపట్టాలనుకునే

అభివృద్ధి కార్యక్రమాలేమిటి..?

సమాధానం: పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేయాల్సిన అవసరముంది. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని దశలవారీగా పరిష్కరించడమే మా లక్ష్యం.

ప్రశ్న: ఓటర్లకు మీరిచ్చే సందేశమేమిటి..?

సమాధానం: అభ్యర్థులు, వారి గత సేవలు, ప్రజలతో ఉన్న సంబంధాలు, గ్రామాభివృద్ధిపై వారి ప్రణాళికలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలతో పాటు అనంతరం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే నాయకత్వం ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement