1,725 మందితో బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

1,725 మందితో బందోబస్తు

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు కార్పొరేషన్‌, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల ఎన్నికలకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. నవంబర్‌ ఒకటిన ఈ మూడు ప్రాంతాల్లోని 594 పోలింగ్‌ కేంద్రాల్లో 5.52 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1,725 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సుమారు 2 వేల మందిని ఇప్పటికే అధికారులు బైండోవర్‌లు చేశారు. పోలింగ్‌ రోజు అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. 52 అత్యంత సున్నిత, 200 సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వాటి వద్ద సాధారణ భద్రతతోపాటు అదనంగా సిబ్బందిని మోహరిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటును వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు.

అప్రమత్తంగా ఉండాలి

‘ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. చిన్న ఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి’ అని నగర ఏఎస్పీ దీక్ష పోలీస్‌ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నెల్లూరులోని పోలీస్‌ కవాతు మైదానంలో నగర కార్పొరేషన్‌ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వర్తించనున్న పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఆమె దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతోపాటు నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు గుమికూడకుండా చూడాలని, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పాదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఏఎస్పీ డీకేడబ్ల్యూ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌, బ్యాలెట్‌ బాక్స్‌ల డిస్ట్రిబ్యూషన్‌, రిసీవింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో నగర, రూరల్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌ సీతారామయ్య, జి.వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, సీహెచ్‌ కోటేశ్వరరావు, కె.సాంబశివరావు, కె.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement