కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండున్నరేళ్లలో పింఛన్ల విషయమై నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎంతో మంది అర్హులను తొలగించి వారికి అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ తరుణంలో కొత్తగా మంజూరు చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటించి.. ఎంతో మంది నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఎన్నికల కోడ్ అంటూ మంగళం పాడింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఈ రకంగా కుటిల రాజకీయాలకు పాల్పడుతుండటంపై ఎంతో మంది మండిపడుతున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తమకు సజావుగా అందేవని గుర్తుచేసుకుంటున్నారు.
నెల్లూరు(పొగతోట): పింఛన్.. ఈ పేరు వింటేనే లబ్ధిదారులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఏ కారణం చూపి తమ నుంచి వీటిని దూరం చేస్తారోననే ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 29 నెలల్లో ఒక్కరికీ కొత్తగా మంజూరు చేసిన దాఖలాల్లేవు. ఇంట్లో ఎవరైనా మరణిస్తేనే వీటిని ఇస్తున్న దుస్థితి నెలకొంది.
సరికొత్త డ్రామా
పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వేల మందికిపైగా అర్హులు నిరీక్షిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేకుండా యాప్‌ను సర్కార్ రెండు నెలల క్రితం వరకు బ్లాక్ చేసింది. ఈ తరుణంలో ఎన్నికలొస్తున్నాయనే టాక్‌తో దరఖాస్తు చేసుకునేందుకు పది రోజుల పాటు అనుమతించింది. జిల్లాలో 65 వేల మంది అప్లయ్ చేసుకోగా, ఇందులో 55 వేల దరఖాస్తులకు ఆమోదముద్రేసి.. మిగిలిన వాటిని తిరస్కరించారు. అయితే వీటిని నేటికీ ఇవ్వలేదు. అసలు ఎంత కాలం నిరీక్షించాలో పాలుపోక అర్హులు తలలు పట్టుకుంటున్నారు.
ఎంతో మందికి క్షోభ
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాలో 34 వేలకుపైగా పింఛన్లను తొలగించారు. పరిశీలన పేరుతో దివ్యాంగులకు క్షోభను మిగిల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2024 ఏప్రిల్ నాటికి 3.19 లక్షల మంది లబ్ధిదారులుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 2.85 లక్షలకు పతనమైంది. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు అందే వాటిని తొలగించారు.
నాడంతా సజావుగా..
గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పింఛన్ల నగదును ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా అందజేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ అర్హులు తిరిగే అవసరం లేకుండా.. ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశమూ అప్పట్లో ఉండేది. అయితే ప్రస్తుతం ఇవేవీ మచ్చుకై నా కానరావడంలేదు.
కొత్తగా మంజూరు చేస్తామనే ఆశ చూపి..
ఎన్నికల కోడ్ అంటూ మంగళం
ఉన్న వాటిని రకరకాల కారణాలతో తొలగిస్తూ..
కూటమి ప్రభుత్వ కపట నాటకాలు
జిల్లాలో ఇలా.. 2024 ఏప్రిల్ నాటికి – 3.19 లక్షల మంది లబ్ధిదారులు ప్రస్తుతం – 2.85 లక్షలు
కోతకు గురైనవి – 34 వేలు


