బిహార్‌ను మించిన అరాచకం | - | Sakshi
Sakshi News home page

బిహార్‌ను మించిన అరాచకం

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

● ధ్వజమెత్తిన మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు రూరల్‌: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిహార్‌ను మించిన అరాచకాన్ని టీడీపీ ప్రభుత్వం సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 32 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారుల అండతో తిరస్కరించి.. బలవంతంగా విత్‌డ్రా చేయించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఏకగ్రీవానికి యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారాలపై ఎన్నికల సంఘం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. చేజర్ల మండలంలో పది ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తమ పార్టీ వారు దాఖలు చేసిన తొమ్మిది నామినేషన్లను అకారణంగా తిరస్కరించారని దుయ్యబట్టారు. మర్రిపాడు, సంగం, అనుమసముద్రంపేట మండలాల్లో పోలీస్‌ బలగాలను మోహరించి తమ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఎన్నికల అధికారులతో పాటు ఆత్మకూరు సీఐ గంగాధర్‌, మర్రిపాడు ఎస్సై బలరామిరెడ్డి వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని చెప్పారు. మంత్రి ఆనం ఆదేశాలతో కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు మున్సిపాల్టీలోని రెండు వార్డుల్లో తమ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని.. ప్రతిపక్ష అభ్యర్థులు బరిలో లేకుండా చేసి ఏకగ్రీవాలుగా గొప్పలు చెప్పుకోవడం ఆనానికి సిగ్గుచేటని విమర్శించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు, మర్రిపాడు జెడ్పీటీసీ అభ్యర్థులు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి, నేతలు కృష్ణప్రసాద్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, అల్లంపాటి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement