అధికార పార్టీ నేతలకు దాసోహం | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతలకు దాసోహం

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

● తొత్తులుగా ఆర్వోలు

● అభ్యర్థులకు తెలియకుండానే

నామినేషన్ల విత్‌ డ్రా

● కొత్త రకం నాటకానికి శ్రీకారం

నెల్లూరు(పొగతోట): అధికారం తమదనే ధీమాతో కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆర్వోలను బెదిరించి తాము చెప్పినట్లు చేయాలంటూ ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంఽధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను ఆర్వోలు, ఏఈఆర్వోలు మంగళవారం నిర్వహించారు. అయితే ఇక్కడే కొందరు అధికారులు టీడీపీకి తొత్తులుగా మారారు.

ఇదో ఉదాహరణ..

కొడవలూరు మండలానికి సంబంధించిన బీఎస్పీ జెడ్పీటీసీ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అయితే విత్‌డ్రా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాలు రంగంలోకి దిగి, జెడ్పీ కార్యాలయానికి చేరుకొని అధికారులతో మాట్లాడారు. అభ్యర్థి తరఫు వారితో ఆఫీసర్లు, టీడీపీ నేతలు మాట్లాడి పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. చివరికి ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు. తాను పోటీలో ఉన్నప్పుడు ఎలా ఏకగ్రీవమవుతుందని అభ్యర్థి వాగ్వాదానికి దిగగా, టీడీపీ నేతలు బుజ్జగించడంతో సమస్య సద్దుమణిగింది.

మంత్రి చెప్పినట్లు..

సంగం, చేజర్ల, మర్రిపాడు తదితర మండలాల్లో అధికార పార్టీకి ఆర్వోలు అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించే ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ప్రకటించారు. బీ ఫారాలను అందజేసిన అనంతరం మంత్రి చెప్పిన విధంగా ఆర్వోలు తలూపారు. చివరికి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ఎస్సీ మహిళ కందుకూరులో ఉంటే, ఆమె వచ్చి నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకున్నారంటూ బోగస్‌ సంతకాలతో ఆర్వోలు ఏకగ్రీవం చేశారు. జిల్లాలోని పలు చోట్ల ఇదే తంతు సాగింది. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా, ఆర్వో నిర్ణయమే అంతిమమని చెప్తున్నారు.

కోర్టు ఆదేశాలు బేఖాతర్‌

నామినేషన్లు, ఉపసంహరణ తదితరాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను భద్రపర్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదెక్కడా అమలు కాలేదు. నామినేషన్ల సమయంలో ఆర్వో కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు.. ఉపసంహరణ రోజుకు మాయమయ్యాయి. వీటిని ఆర్వోలు తీసేశారు. తమ కుట్రలు ఎక్కడ బయటపడతాయోననే ఉద్దేశంతో ఇలా వ్యవహరించారని సమాచారం.

జనసేన అభ్యర్థికి వెన్నుపోటు

సంగం మండలం జెండాదిబ్బ ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ను హేమలత దాఖలు చేశారు. బీ ఫారాన్ని అందజేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ తరుణంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌, ఎస్సై, పోలీసుల సమక్షంలోనే పత్రాలను టీడీపీ నేతలు లాక్కొని చించేశారు. ఈ క్రమంలో మరో బీ ఫారాన్ని ఆర్వోకు ఆమె సమర్పించారు. అయితే సాయంత్రానికి ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు. నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకోవాలంటూ ఆమెను ఒత్తిడి చేశారు. ఓ దశలో రూ.పది లక్షల వరకు ఇస్తామనే ఆశనూ చూపారు. అయినా ససేమిరా అనడంతో మంత్రితో ఫోన్‌ చేయించారు. అప్పటికీ ఆమె ఏ మాత్రం తగ్గకపోవడంతో విత్‌డ్రా చేసుకున్నారంటూ ప్రకటించారు. ఈ విషయమై కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఏ విధంగానైనా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. నామినేషన్ల ఉపసంహరణలో ఇన్ని అక్రమాలు జరిగినా, ఎవరిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement