ఎన్నికలంటే మంత్రి ఆనానికి భయం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలంటే మంత్రి ఆనానికి భయం

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

● దౌర్జన్యాలు, అక్రమాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు

● దమ్ముంటే మా అభ్యర్థులతో పోటీ పడాలి

● వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు ఇన్‌చార్జి

మేకపాటి విక్రమ్‌రెడ్డి

నెల్లూరురూరల్‌: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేక, అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను ఆయన కలిశారు. నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న దౌర్జన్యాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తిరస్కరణకు గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

మీ స్థాయికి తగదు

ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ దమ్ము, ధైర్యం ఉంటే అక్రమ ఏకగ్రీవాలను పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నేరుగా పోటీ పడాలని మంత్రికి సవాల్‌ విసిరారు. తరతరాల రాజకీయ చరిత్ర, కుటుంబ వారసత్వం గురించి గొప్పలు చెబుతూ.. చివరకు అడ్డదారుల్లో ఏకగ్రీవాలు సాధించుకోవడం ఆయన స్థాయికి తగదని విమర్శించారు. పోలీసు అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో కుమ్మకై ్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా చేసి ఏకగ్రీవాలు సాధించుకున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలే ఎన్నికలను ఎదుర్కోవడంలో అధికార పక్షం భయాన్ని బయటపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వంటి పరిణామాలు గతంలో ఎన్నడూ లేనంతగా చోటుచేసుకుంటున్నాయన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు. నామినేషన్ల తిరస్కరణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement