● అధికార దుర్వినియోగంపై
కలెక్టర్‌కు ఫిర్యాదు
● అవకతవకలకు పాల్పడిన వారిని
వదిలిపెట్టేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అక్రమాలకు కూటమి నేతలు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎన్నికల చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్‌రెడ్డితో కలిసి బుధవారం ఫిర్యాదు చేసిన అనంతరం కాకాణి మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి దౌర్జన్యాలకు కూటమి నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలోనూ ఉద్యోగులను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రహస్యంగా జరగాల్సిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన పరిణామాలను వీడియోల్లో చిత్రీకరించామని, వీటిని కలెక్టర్‌కు చూపామన్నారు. ఆనం కార్తీక్‌రెడ్డితోనూ దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ అపహాస్యం
నామినేషన్ల పరిశీలన నుంచి ఉపసంహరణల వరకు పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నకిలీ నామినేషన్లు, బెదిరింపుల వ్యవహారాల అనంతరం ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్‌లోనూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూడటం సరికాదని హితవు పలికారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమాలపై సాక్ష్యాధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు చేపట్టేంత వరకు పోరాటాన్ని తమ పార్టీ కొనసాగించనుందని వెల్లడించారు. ఫిర్యాదుపై తగు చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు.


