● పదేళ్ల బాలిక మృతి
● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
కోవూరు: ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన వయసులోనే ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఊయల ఊగుతూ జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని పాటూరు పాత హరిజనవాడకు చెందిన మార్తాటి శ్రీను వరికుంటపాడులో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె శర్వాణి (10) బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఊయల ఊగుతుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వాహనం వచ్చేలోపే కుమార్తెను కారులో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. దారిలో 108లో బాలికను కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే ఆడుతూ పాడుతూ గడిపిన కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.


