నెల్లూరు(బారకాసు): ఓటేసిన ప్రతిసారీ వినతులు ఇవ్వడం.. ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారకపోవడం.. దశాబ్దాలుగా నెల్లూరు నగరవాసులకు ఇది అలవాటైపోయింది. అయితే 2019 – 24 మధ్య కాలంలో వైఎస్సార్‌సీపీ హయాంలో సింహపురి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎవరొచ్చినా ఈ సమస్యలు తీరవు అనుకున్న ప్రతి చోటా పరిష్కారం లభించింది. మౌలిక వసతుల కల్పన, పర్యాటకాభివృద్ధి, పారిశ్రామిక వేగంతో నెల్లూరు సరికొత్త వెలుగులు నింపుకొంది.
ఎన్నో పనులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నగరంలో రహదారులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పార్కులు, సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్ కెనాల్ రివిట్‌మెంట్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మరో వంతెన నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో 2020 ఆగస్టులో నగరంలోని మినీబైపాస్ రోడ్డులో హరనాథపురం జంక్షన్‌లో ఫ్లై ఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ఉండేందుకు అప్పటికే నగరంలో మూడు ఫ్లై ఓవర్లు నిర్మించి ఉన్నారు. కొత్తది ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. దీంతో నేడు వాహనదారులు ఎంతో హాయిగా రాకపోకలు సాగిస్తున్నారు.
రూ.41.88 కోట్లతో నిర్మాణం
2020 ఆగస్టులో రూ.41.88 కోట్ల అంచనాలతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేశారు. మధ్యలో కరోనా విపత్కర పరిస్థితులు, మరోవైపు వర్షాల కారణంగా నిర్మాణ పనులు కొంతమేర నెమ్మదిగా జరిగినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా పనులు చేపట్టి పూర్తి చేయడం గమనార్హం. అయితే ఇప్పటివరకు మహానగరాల్లో నిర్మించిన తరహాలో తొలిసారిగా హరనాథపురం కూడలిలో ఈ వంతెనను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడం జరిగింది.
కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు
నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా కాలువలు, కల్వర్టులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలతోపాటు పైభాగంలో సెంట్రల్ లైటింగ్ పనులు కూడా చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా నగరంలో ఇటువంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదేమోనన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ఎంతసేపటికీ దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం తప్ప నగరాభివృద్ధి గురించి గానీ, ప్రజా సంక్షేమం గురించి గానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే
ఫ్లై ఓవర్ నిర్మాణం
రూ.41.88 కోట్లతో మెట్రో నగరాల
తరహాలో..
తొలగిన ట్రాఫిక్ ఇక్కట్లు
ఇదికదా అభివృద్ధి అంటున్న నగర ప్రజలు


