రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

● కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరురూరల్‌: రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించి, డిజిటల్‌ వ్యవసాయ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాల్లో అగ్రిస్టాక్‌ అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రాంతాల వారీగా, రైతుల వారీగా, పంటల వారీగా వ్యవసాయ సమాచారాన్ని సమీకరించి, రైతులను మార్కెటింగ్‌ సంస్థలతో అనుసంధానం చేయాలన్నారు. పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వేరుశనగ పంటలకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, విలువ జోడింపు ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పొగాకు రహిత

సమాజానికి కృషి

నెల్లూరు(అర్బన్‌): పొగాకు రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత అన్నారు. యువత పొగాకు వినియోగానికి దూరంగా ఉండేందుకు చేపట్టిన టీవైఎఫ్‌సీ – 4.0 కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అన్షుధర్‌లు ఆవిష్కరించి మాట్లాడారు. డిసెంబర్‌ 27వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన తెస్తామన్నారు. పొగాకు వల్ల కేన్సర్‌ లాంటి ప్రమాదాలు, ఊపిరితిత్తుల జబ్బులు అధికమవుతున్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలలను పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండేలా కృషి చేస్తామన్నారు. ఈ ప్రచార ఉద్యమం పొగాకు నియంత్రణ చట్టాల అమలును బలోపేతం చేయడం, ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల నిషేధ చట్టం గురించి వివరించడం, పొగాకు రహిత గ్రామాలను ప్రోత్సహించడం దిశగా సాగుతుందన్నారు.

జిల్లా జైల్లో ఖైదీ ఆత్మహత్య

వెంకటాచలం: ఉరేసుకుని ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా జైలులో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు ఎస్పీ కాలనీకి చెందిన కంటేపల్లి శ్రీనివాసులు (40) జైల్లో ఖైదీగా ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం జైలు ప్రాంగణంలోని హాస్పిటల్‌ బ్లాక్‌ వెనుక వైపు ఉన్న వేపచెట్టుకు టవల్‌తో ఉరేసుకున్నాడు. సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఎం.వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు

● రూ.3 వేల జరిమానా

గూడూరు: నాయుడుపేట అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. ఏడేళ్ల జైలుశిక్షతోపాటుగా రూ.3 వేల జరిమానాను విధిస్తూ గూడూరు అసిస్టెంట్‌ సెషన్స్‌ న్యాయమూర్తి బుధవారం తీర్పును వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామానికి చెందిన పట్టుకోట మురళీమోహన్‌పై అదే గ్రామానికి చెందిన అరుసూర్‌ అనిల్‌ అనే వ్యక్తి హత్యాయత్నం చేశాడని 2018లో కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ను దాఖాలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. జరిమానా చెల్లించలేకపోతే అదనపు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement