ప్రాణాలు కోల్పోయి.. విషాదం నింపి | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కోల్పోయి.. విషాదం నింపి

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

స్పీడ్‌ బ్రేకర్‌ను దాటే క్రమంలో..

నెల్లూరు(క్రైమ్‌): స్పీడ్‌ బ్రేకర్‌ను దాటే క్రమంలో మోటార్‌బైక్‌ అదుపుతప్పి కరెంట్‌ పోల్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం జ్యోతినగర్‌కు చెందిన షేక్‌ ఖలీలుల్లా (28) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతను మంగళవారం రాత్రి ములుముడి బస్టాండ్‌ సెంటర్‌ నుంచి పుత్తా ఎస్టేట్‌ వైపు బైక్‌పై బయలుదేరాడు. కుక్కలగుంట క్రాస్‌రోడ్డు వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ను దాటే క్రమంలో బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్‌ కరెంట్‌పోల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై అబ్దుల్‌ రహీమ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సరదాగా వెళ్లి..

వాకాడు: స్నేహితులతో సరదాగా ఆటోలో వెళ్తున్న ఓ బాలుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన వాకాడు మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోట మండలం శ్యామసుందరపురానికి చెందిన బిందె శ్రీనివాసులు, మాధవి దంపతుల కుమారుడు అనుక్‌ (16) ఇటీవల అయ్యప్పమాల వేసుకుని ఇంటి వద్ద ఉంటున్నాడు. అతని స్నేహితులు ఆటో తోలుకుని చిరు వ్యాపారానికి వెళ్తుండగా వారితో కలిసి సరదాగా వెళ్లాడు. ఈ క్రమంలో ఆటో వాకాడు చెరువు వద్దకు వచ్చేసరికే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన అనుక్‌ చనిపోయాడు. అలాగే ఆటోలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుక్‌ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై నిఖిల్‌బాబు వివరాలు సేకరించి మృతదేమాన్ని పోస్టుమార్టం బాలిరెడ్డిపాళెం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బైక్‌ అదుపుతప్పి కరెంట్‌పోల్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు, ఆటో బోల్తా పడి ఓ బాలుడు దుర్మరణం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement