నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ ఒకటో డివిజన్ అభ్యర్థి ఎస్‌కే కరిముల్లాపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తకాలువ నుంచి కోడూరుపాడుకు వెళ్లే దారిలోని బాలాజీ సన్‌సిటీ లేవుట్ వద్ద ఎస్‌కే కరిముల్లా కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అతను తన డివిజన్‌లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు కరిముల్లాకు ఘన స్వాగతం పలుకుతూ వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి, ఆయన వర్గంలో ఓటమి భయం ఏర్పడింది. ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న క్రమంలో కరిముల్లాపై దాడి చేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పక్కా ప్రణాళికతో..
మంగళవారం ప్రచారం ముగించుకుని రాత్రి కరిముల్లా కుటుంబం నిద్రలో ఉంది. తెల్లవారుజామున అతడికి బెడ్‌రూమ్ కిటికీ వద్ద ఎవరో ఉన్నట్లు అనిపించడంతో చూసేందుకు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్క్‌లు ధరించి గోడపై కూర్చొని ఉన్నారు. కరిముల్లా గట్టిగా కేకలు వేయడంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మరో వ్యక్తి కర్రతో కొట్టాడు. కరిముల్లా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అరుపులకు కుటుంబ సభ్యులు లేచి వస్తున్న విషయాన్ని దుండగులు గుర్తించి పరారయ్యారు. కరిముల్లా ఛాతిపై, తల, మెడపై గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడిని జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందాడు. రూరల్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు అందింది. బుధవారం రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు వెళ్లి విచారణ చేశారు.


