కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

● గూడూరు సమన్వయకర్త గురవయ్య

గూడూరురూరల్‌: ‘కూటమి పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి ఊసే కనిపించడం లేదు. నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి’ అని వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య అన్నారు. మండలంలోని సంతదాసుపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అట్ల సంపూర్ణమ్మ, జెడ్పీటీసీ అభ్యర్థి కొట్టు నరేష్‌కు మద్దతుగా బుధవారం మిట్టాత్మకూరు, విందూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు మండలంలోని జెడ్పీటీసీతోపాటు 8 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలను మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. ఎవరూ భయపడకుండా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు పోలీసులను ముందుపెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. నామినేషన్ల పత్రాలు లాక్కోవడం, పేపర్లు చించివేయడం, దాడులకు దిగడం చేశారని, అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యల్లా శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బాబులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మేకనూరు సెగ్మెంట్‌ పరిధిలోని కాండ్ర గ్రామంలో అభ్యర్థిని ఉగ్గుమూడి రూపకళ, జెడ్పీటీసీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. నాయకులు రవి రాజు, మనుబోలు కృష్ణయ్య పాల్గొన్నారు.

మద్యం తాగొద్దని చెప్పడంతో..

● భర్త ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం అంబాపురం దళితవాడకు చెందిన దేవా (27), పెంచలమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దేవాకు ఇదివరకే తలకు గాయమై ఆపరేషన్‌ జరిగింది. అతను మద్యానికి బానిసై నిత్యం తాగేవాడు. తాగొద్దని పలుమార్లు భార్య చెప్పినా పట్టించుకోలేదు. ఈక్రమంలో మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య ఎందుకు తాగావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన దేవా తిరిగి రాలేదు. పెంచలమ్మ అన్న మస్తాన్‌ బుధవారం అంబాపురం కలుజు వద్ద కాలువ గట్టునున్న వేపచెట్టుకు దేవా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించి ఇంట్లో చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని భర్త మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. తాగుడు వ్యసనం మానలేక, తలభారం తగ్గక క్షణికావేశంలో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement