● మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత
వెంకటాచలం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అనేక దుర్మార్గాలకు పాల్పడిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ధ్వజమెత్తారు. మండలంలోని కంటేపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థిని డక్కిలి వెంకటరమణమ్మ, ఎంపీటీసీ అభ్యర్థినిగా పోటీలో ఉన్న వెలిబోయిన అపర్ణ వెంకట్‌కు మద్దతుగా బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పూజిత మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడికెళ్లినా గత ఐదేళ్ల జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయో తప్ప, కూటమి పాలనలో జరిగిన పనులు ఎక్కడా కానరావడం లేదన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని చోట్ల నామినేషన్లు వేయనీకుండా అడ్డుకోవడం, పత్రాలు తీసుకుని కేంద్రాల్లోకి వెళ్లినా వాటిని టీడీపీ నాయకులు చింపేసి దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. పరువు కాపాడుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తన తండ్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఇంకేమీ కనిపించడం లేదన్నారు. పనులు చేయించి, ప్రజల మన్ననలు పొంది నిజాయితీగా ఎన్నికల్లో గెలవాలన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేలా వ్యవహరించిన విషయాన్ని ప్రజలు గమనించి, ఓటుతో టీడీపీకి గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, జిల్లా నాయకుడు వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


