వైఎస్సార్సీపీ నేత అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నేత అరెస్ట్‌

Oct 28 2026 1:24 AM | Updated on Oct 28 2026 1:24 AM

బలవంతపు ఏకగ్రీవాలు

సీతారామపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చింతరెడ్డి లోకేశ్‌రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి ఉదయగిరి కోర్టుకు తరలించారు. ఎంపీటీసీ బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థుల బీ ఫారాలను సమర్పించేందుకు గానూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఈయన్ను ఖాకీలు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఎంపీపీ అభ్యర్థయిన ఈయన నామినేషన్‌ పత్రాన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన విషయం విదితమే. ఎంపీడీఓ కార్యాలయంలోని నోటీస్‌ బోర్డులో పేర్ల జాబితాను చూసేందుకు ఆదివారం రాత్రి వచ్చిన లోకేశ్‌రెడ్డిపై అక్రమ కేసును బనాయించిన సంగతి తెలిసిందే. పోలీస్‌స్టేషన్లో నిర్బంధించారనే విషయాన్ని తెలుసుకున్న పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి చేరుకొని ఎస్సై వెంకటరాజేష్‌తో మాట్లాడారు. లోకేశ్‌రెడ్డిని పరామర్శించారు. స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఆ తర్వాత ఉదయగిరి కోర్టుకు తరలించడం మండలంలో చర్చనీయాంశమైంది.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్యానికి పునాదులైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికలను పోలీసులు, అధికారులు కలిసి రణరంగ క్షేత్రంగా మార్చారు. యంత్రాంగమే అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను ఎన్నికల బరిలోకి దిగనీయకుండా బెదిరింపులకు దిగారు. వాటిని లెక్క చేయకుండా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేశారు. నోట్ల కట్టలతో ఆశ చూపినా తలొగ్గని వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు. అయినప్పటికీ అభ్యర్థులు బరిలో నిలబడడంతో చివరకు నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గెలిచే ధైర్యం లేక.. ప్రత్యర్థులతో పోరాడలేక..

ప్రజల మద్దతు సంపాదించి, ప్రత్యర్థులతో పోరాడి గెలవాల్సిన ఎన్నికల్లో వారిని బరిలో లేకుండా చేసి ఏకగ్రీవాలను చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను అడ్డు పెట్టుకొని అధికార పార్టీ దొడ్డిదారి రాజకీయాలకు తెర తీసింది. జిల్లాలో 440 ఎంపీటీసీ, 35 జెడ్పీటీసీ స్థానాలకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి అధికార పార్టీ ఓటమి భయంతో శిఖండి రాజకీయం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ఆశావహులను పోటీలో తలపడనీయకుండా పోలీసులతో బెదిరింపులకు దిగింది. అయినా బెదరకుండా నామినేషన్లు వేయడానికి వస్తే.. మారణాయుధాలతో దాడులు చేశారు. నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేశారు. ఇన్ని అడ్డంకులను అధిగమించి నామినేషన్లు దాఖలు చేస్తే.. పరిశీలన ప్రక్రియలో చిన్న చిన్న కారణాలతో ప్రత్యర్థుల నామినేషన్లు మాత్రమే తిరస్కరింప చేశారు. అయినా.. బరిలో బలంగా నిలిచిన అభ్యర్థులు మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ, బీ–ఫారాలు అందజేసేందుకు ఆఖరి క్షణం వరకు ఆర్థికంగా ప్రలోభాలకు గురి చేశారు. అప్పటికీ తలొగ్గని వారి నామినేషన్లను బీ–ఫారాలను అందించినా.. దొడ్డిదారిన అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి ఉపసంహరించి ఏకగ్రీవమయ్యామంటూ జబ్బలు చరుకుంటున్నారు.

జెడ్పీటీసీ స్థానాలకు రూ.కోట్లు నజరానా

జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూడా అధికార పార్టీ అడ్దదారులను తొక్కింది. చిల్లకూరు జెడ్పీటీసీ స్థానానికి పోటీకి సిద్ధపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పోలీసులతో బెదిరించడంలో నామినేషనే దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి బరిలోకి దిగిన ప్రధాన అభ్యర్థులతోపాటు డమ్మీ అభ్యర్థులకు భారీగా నగదు ప్రలోభాలు గురి చేసి ఆఖరి క్షణంలో విత్‌డ్రా చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సీతారామపురంలో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థితో బలవంతంగా నామినేషన్‌ ఉపసంహరింప చేసి ప్రజాబలమంటూ జబ్బులు చరుచుకుంటూ.. నిస్సిగ్గు రాజకీయం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈసడించుకుంటున్నాయి.

జిల్లాలో ఎంపీటీసీలుగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బబెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకే ఉపసంహరణ గడువు ముగియాల్సి ఉండగా సాయంత్రం 6 గంటల వరకు కూటమి నేతలకు అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఉపసంహరణ జరిగే ఛాయలకే రాకుండా పోలీసులు అడ్డుపడి భయపెట్టారు. మర్రిపాడు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, నామినేషన్ల పరిశీలనలో ఐదు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు అక్రమంగా తిరస్కరించారు. ఉపసంహరణ ఆఖరి రోజు మరో రెండు ఎంపీటీసీ స్థానాలకు బీ ఫారాలు అందజేసినా.. పోలీసులను అడ్డుపెట్టుకుని.. నామినేషన్లు ఉపసంహరించి ఏకగ్రీవం చేశారు. అనంతసాగరంలో మూడు, ఏఎస్‌పేటలో నాలుగు, సంగంలో ఆరు, సీతారామపురంలో ఐదు, దుత్తలూరులో మూడు, వరికుంటపాడులో రెండు, చేజర్లలో తొమ్మిది, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, అల్లూరు, నెల్లూరు రూరల్‌లో ఒక్కొక్కటి, బుచ్చిరెడ్డిపాళెంలో రెండు, కొడవలూరు, ఇందుకూరుపేటల్లో 10 నామినేషన్లు విత్‌ డ్రా చేయించారు. ఇక నామినేషన్లకు ముందే జిల్లా వ్యాప్తంగా 11 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులను బెదిరించి కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement