● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
గూడూరు రూరల్: ఎన్నికల్లో ఓటమి భయంతో తమ పార్టీ అభ్యర్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని రామలింగాపురంలో సంతదాసుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి అట్ల సంపూర్ణమ్మ నివాసానికి మంగళవారం వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, తమ పార్టీ అభ్యర్థులు భయపడబోరని, వీరికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి అక్రమ పాలనపై ప్రజలే తీర్పునివ్వనున్నారని చెప్పారు. అట్ల శ్రీనివాసులురెడ్డిపై జరిగిన ఘటనను తెలుసుకున్న తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి.. స్వయంగా వెళ్లి పరామర్శించాలని తనకు సూచించారని వివరించారు. శ్రీనివాసులురెడ్డి సతీమణి సంపూర్ణమ్మ ఎంపీటీసీగా గెలుస్తారనే కసితో ఆయనపై అక్రమ కేసులు బనాయించేందుకు యత్నించారని మండిపడ్డారు. పోలీసుల జోక్యంతో నేరుగా మద్యం బాటిళ్లను తెచ్చి ఆయన ఇంట్లో పెట్టి.. లైట్లు ఆర్పేసిన అనంతరం అక్కడికెళ్లి సోదాలు చేసి మద్యం బాటిళ్లు దొరికాయంటూ అన్యాయంగా కేసులు పెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమాన్నే పక్కనబెట్టి ఎన్నికల్లో అడ్డదారులను కూటమి పార్టీలు తొక్కుతున్నాయని ఆరోపించారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రశాంతమైన గూడూరు నియోజకవర్గంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదని చెప్పారు. పోలీసులే దొంగలుగా మారితే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. నామినేషన్లేసే సమయంలో తమ పార్టీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. డీఎస్పీ స్థాయి అధికారి తమ పార్టీ నేతకు ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించడం, భయపెట్టడమేమిటని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థకు ఉండాల్సిన మర్యాదను దిగజార్చేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చాణక్య నీతి, రాజనీతిపై డీఎస్పీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఖాకీ చొక్కా వేసుకొని ఉద్యోగం చేసే అర్హత ఆయనకు లేదని స్పష్టం చేశారు.
ఓట్లేయించుకునే దమ్ము లేదు
అన్నీ తామే చేశామంటూ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తదితరులు గొప్పలు చెప్పుకొంటున్నారని, అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేయించుకునే దమ్ము వారికి లేదని విమర్శించారు. చిట్టమూరు మండలాధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి.. పెళ్లకూరులో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. ఇలా తమ పార్టీకి చెందిన అనేక మంది నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులపై తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గంజాయి బ్యాచ్‌తో మహిళలను బెదిరింపులకు గురిచేసి నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకున్నారని చెప్పారు. అక్రమ కేసులపై విచారణను ఎస్పీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజల కోసం పనిచేయాలి
ప్రజల కోసం పోలీస్ వ్యవస్థ పనిచేయాలని, అయితే అలా కాకుండా ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తూ ఎలా చెప్తే అలా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య ఆరోపించారు. డీఎస్పీ బెదిరింపులకు భయపడే నైజం తమ పార్టీ శ్రేణులది కాదని చెప్పారు. గెలుపోటములను ప్రజలే నిర్ణయించనున్నారని పేర్కొన్నారు. నేతలు చేవూరు విజయమోహన్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి, పట్టణాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, యల్లా శ్రీనివాసులురెడ్డి, నాసిన నాగులు, నాగిశెట్టి శారద, సుబ్బానాయుడు, జనార్దన్‌రెడ్డి, మహేష్, పల్లి కోటేశ్వరరావు, వెంకటరమణారెడ్డి, కృష్ణయ్య, చంద్రమోహన్, ప్రసాద్, కల్లూరు రవి తదితరులు పాల్గొన్నారు.


