● ఎన్నిక నుంచి తప్పుకోవాలని, ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిపోవాలని సూచన
● రూ.70 లక్షలు ఆఫర్ చేసిన
వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
● మధ్యవర్తిత్వం వహించిన
చిన్నబజారు సీఐ సీతారామయ్య
● సీఐ వాహనంలోనే డబ్బులు
పంపిస్తానన్న అజీజ్ వాట్సాప్ కాల్ ఆడియో వైరల్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ప్రత్యర్థులను బరి నుంచి తప్పించేందుకు సామదానభేద దండోపాయలను ప్రయోగించినా.. ఫలితం లేకపోవడంతో దింపుడు కల్లాం ఆశతో ఆఖరికి పోలీసులతో ప్రలోభాల పర్వానికి వచ్చింది. నెల్లూరు నగరంలోని 58వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఆ డివిజన్లో టీడీపీ ఓటమి ఖాయమనుకున్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ అభ్యర్థిని ప్రచారాలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా చిన్నబజారు సీఐ సీతారామయ్యను మధ్యవర్తిత్వంతో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేరుగా అభ్యర్థి భర్త జమీర్‌తో వాట్సప్ కాల్ ద్వారా బేరసారాలు చేసేందుకు ప్రయత్నం చేశారు. సీఐ సీతారామయ్య, అబ్దుల్ అజీజ్ పోటీ నుంచి తప్పుకుంటే.. రూ.70 లక్షలిస్తామంటూ ఆఫర్ చేశారు. డబ్బుని సీఐ వాహనంలోనే పంపిస్తాను. 15 నిమిషాల్లో ఎక్కడికి కావాలో అక్కడికి చేరిపోతాయి. ఫైట్ బుక్ చేసుకుని ఎక్కడికై నా వెళ్లిపో ఓకే నా.. అంటూ అజీజ్ అడిగారు.
సీఐ: జమీర్ వింటున్నావా? క్యాండిడేట్‌వి రెండు చెక్కులు తెప్పిస్తున్నా.. డబ్బులు ఇవ్వగానే వారి చెక్కులు వారికి ఇచ్చేయ్
అజీజ్: డౌట్లు వద్దు, సమస్య ఏమీ లేదు. సీతారామ్ ఎక్కడైనా ఒక లొకేషన్ చెబితే అక్కడికి పంపిస్తాను.
సీఐ: నువ్వే లొకేషన్ చెప్పు జమీర్
అజీజ్: డీఎస్సార్ స్కూల్ లొకేషన్లో ఉంటారు జమీర్ అక్కడికి వెళ్లిపో.. ఇబ్బంది లేదు. నువ్వు కూడా అక్కడే ఉండు సీతారామ్.. నీ బండిలో పెట్టిస్తా చూసుకో
సీఐ: నా దగ్గరే ఉంటాయి రమ్మనండి.
... అంటూ సాగిన బేరసారాలు సంభాషణ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


