● నామినేషన్లను అన్యాయంగా
తిరస్కరించి.. గెలుపా..?
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు సిటీ: రాష్ట్రంలో ఆటవిక పాలన కావాలో.. లేక న్యాయమైన పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చింతారెడ్డిపాళెంలోని పార్టీ రూరల్ కార్యాలయంలో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ ఫారాలను బుధవారం అందజేసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రచారాన్ని గురువారం నుంచి నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు, అరాచకాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. వివిధ కారణాలను చూపి నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా వ్యవహరించి ఏకగ్రీవాలు సాధించామంటూ గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థులపై గెలిచే ధైర్యం లేక.. ఆర్వోలపై ఒత్తిడి పెంచి నామినేషన్లను తిరస్కరించేలా చేశారని ఆరోపించారు. మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసినప్పటి నుంచే ప్రజల్లో అపూర్వమైన ఆదరణ లభిస్తోందని వివరించారు. పోలీసులను కూటమి నేతలు ఉసిగొల్పి, బెదిరింపులకు పాల్పడుతూ బరిలో లేకుండా చేయాలని చూస్తున్నారని.. దమ్ముంటే తమ అభ్యర్థులతో ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలవాలని సూచించారు. తమ పార్టీ శ్రేణులు వెనుకడుగేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్లను అక్రమంగా తిరస్కరించిన అధికారులు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. న్యాయపోరాటం చేయడంతో పాటు ప్రైవేట్ కేసులేసి ప్రాసిక్యూట్ చేయిస్తామని హెచ్చరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆనం విజయకుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఇలాంటి రాజకీయాలెప్పుడూ లేవు..
నామినేషన్‌ను సిద్ధిక్ దాఖలు చేసే సమయంలో కారణం తెలియకుండా ఎవరో కేసు పెట్టారని.. దీని ఆధారంగా తిరస్కరిస్తున్నామని ఆర్వో చెప్పారని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఇలాంటి రాజకీయాలు చేస్తారని ఎప్పుడు ఊహించలేదని తెలిపారు. భయభ్రాంతులకు గురిచేసేందుకు రాళ్లతో దాడులు చేస్తామంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి తాము వచ్చాక, ఎవర్నీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. చెత్త, మొక్కలు, గ్రావెల్.. ఇలా అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మైనార్టీ నేతల ఇళ్ల వద్దకు అర్ధరాత్రి పోలీసులు వెళ్తున్నారని ఆరోపించారు. ఇదే పంథాను కొనసాగిస్తే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
నామినేషన్ల తిరస్కరణకు కుట్ర
తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని ఆనం విజయకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఎనిమిది డివిజన్లను సస్పెన్స్‌లో పెట్టి 7.30 వరకు నిర్ణయం చెప్పకుండా ఆర్వోలు వ్యవహరించారని ఆరోపించారు. సిద్ధిక్ కోసం న్యాయవాదులతో చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లి మాట్లాడారని, ఈ క్రమంలో లాయర్లను మెడబెట్టి తోయాలని.. ఏఎస్పీని బుద్ధి ఉందా నీకు అని టీడీపీ వారు అడిగారన్నారు. తమ పెద్దనాన్న ఏసీ సుబ్బారెడ్డి, తండ్రి ఆనం వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఇలా అందరూ ప్రజలతో మమేకమయ్యామని, సంపదలు సృష్టించాలని రాజకీయాలు చేయలేదని చెప్పారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.


