చిట్టమూరు: మండలంలో నామినేషన్ ప్రక్రియలో భయానక వాతావరణాన్ని టీడీపీ నేతలు సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసేందుకు వీల్లేకుండా దౌర్జన్యం చేసి వెనక్కి పంపారు. పక్కా ప్రణాళికతో పచ్చ పార్టీ మండల నేతలు, రౌడీ మూకలు ముందుగా నామినేషన్ కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరూరు ఎంపీటీసీ అభ్యర్థి కామిరెడ్డి రమేష్‌రెడ్డి రాగా, ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. నామినేషన్‌కు అనిచెప్పడంతో వారు పంపారు. అయితే గుంపులుగా ఉన్న టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ.. దుర్భాషలాడుతూ ఎక్కడ రా నామినేషన్ వేసేది, మర్యాదగా వెనక్కి వెళ్లకపోతే కారును ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు సైతం వీరికి వంతపాడటంతో ఆయన వెనుదిరిగారు.
● కోగిలి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ సమర్పించేందుకు ఎస్సీ మహిళ తీపలపూడి శ్రావణి రాగా, ఆమెను సైకిల్ పార్టీ నేత దుర్భాషలాడారు. ఇక్కడ్నుంచి వెళ్లకపోతే అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళన చెందిన ఆమె వెనుదిరిగారు.
● చిట్టమూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇంటికి పోలీసులు వెళ్లి, చిట్టమూరు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయొద్దంటూ బెదిరించారని రమణయ్య ఆరోపించారు. రోడ్లపై సుమారు 500 మంది తిరుగుతూ హల్‌చల్ చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ టీడీపీ నేతలు గుంపులుగా వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. ఇంత జరుగుతున్నా, చోద్యం చూసేందుకే పోలీసులు పరిమితమయ్యారు.


