తమ్ముళ్ల హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల హైడ్రామా

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

సీతారామపురం: ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గానూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను కూటమి నేతలతో పాటు పోలీసులు అడ్డుకున్నారు. గేటు వద్దే ఆపడంతో గంటల తరబడి నిరీక్షించారు. చివరికి సమయమైపోయిందంటూ వెనక్కి పంపారు. నామినేషన్‌ వేసేందుకు ఒకేసారి వస్తే ఘర్షణలు జరుగుతాయనే అనుమానంతో కూటమి అభ్యర్థులకు ఉదయం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మధ్యాహ్నం నుంచి దాఖలు చేసేందుకు అనుమతులను పోలీసులు మంజూరు చేశారు. అయితే సీతారామపురానికి ఉదయమే చేరుకున్న కూటమి అభ్యర్థులందరూ నామినేషన్లు వేయకుండా మధ్యాహ్నం వరకు డ్రామా ఆడారు. మధ్యాహ్న సమయంలో ఎంపీపీ అభ్యర్థి చింతంరెడ్డి లోకేష్‌రెడ్డితో మిగిలిన ఆరు ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇది గమనించిన పలువురు కూటమి అభ్యర్థులు ముందు తామే వెళ్లాలని ఖాకీలకు చెప్పి, దాఖలుకు కార్యాలయం లోపలికెళ్లారు. దీనిపై పోలీసులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అడగ్గా.. అలా కుదరదనీ, వారొచ్చాకే వెళ్లాలని చెప్పి సుమారు మూడు గంటల పాటు వెయిట్‌ చేయించారు. లోపలికెళ్లిన కూటమి అభ్యర్థులు సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రాకపోవడం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారిని ఖాకీలు పంపకపోవడంతో విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హుటాహుటిన సీతారామపురానికి చేరుకున్నారు. నామినేషన్‌ కేంద్రం వద్ద ఉన్న డీఎస్పీ రమణకుమార్‌ను ప్రశ్నిస్తుండగా, కూటమి వర్గీయులంతా ఒక్కసారిగా వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమయం ముగియడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకుండానే వెనుదిరిగారు. కూటమి అభ్యర్థులు సైతం నామినేషన్లను దాఖలు చేయలేదు. రెండో రోజైన గురువారం నాడూ ఇదే ఎత్తుగడ వేసేందుకు కూటమి వర్గీయులు పన్నాగం పన్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement