గ్లాస్‌ సర్కస్‌ ఫీట్లు | - | Sakshi
Sakshi News home page

గ్లాస్‌ సర్కస్‌ ఫీట్లు

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు / నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీట్ల కోసం సర్కస్‌ ఫీట్లను గ్లాస్‌ పార్టీ చేసింది. మీకంత సీన్‌ లేదని మంత్రి పొంగూ రు నారాయణ, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తేల్చిచెప్పారు. 30 శాతం సీట్లు కేటాయించాలని గ్లాస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుండగా, అన్ని ఇవ్వడం కుదరదని.. సిటీ, రూరల్‌ నుంచి రెండు చొప్పున ఇస్తామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. జనసేన అధిష్టానం ఆదేశాలతో 32 డివిజన్లలో నామినేషన్లేశారు.

ఆనందం.. ఆవిరి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డితో రాష్ట్ర జనసేన నేత శివశంకర్‌ చర్చలు జరిపారు. అయినా నాలుగే ఇస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశాన్ని శివశంకర్‌ మంగళవారం నిర్వహించారు. తమ ప్రతిపాదనకు తగిన విధంగా సీట్లను కేటాయించలేదని, నామినేషన్లేసిన చోట ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఈ ప్రకటనతో జనసేన నేతల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. అయితే కొన్ని గంటల్లోనే ఇది ఆవిరైంది. ఆ పార్టీ నేత అజయ్‌బాబు సైకిల్‌ పార్టీ నేతలతో చర్చించి.. సిటీ, రూరల్‌లో నాలుగు చొప్పున కేటాయించేలా ఒప్పించారు.

దాడికి యత్నం

శివశంకర్‌పై జనసేన నగర నేత సుజయ్‌బాబు అనుచరురాలు కార్పొరేటర్‌ అభ్యర్థి ఆలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని డివిజన్లలో పోటీ చేస్తామని చెప్పడంపై ప్రశ్నించారు. మీ వల్ల తమకు నష్టం జరుగుతోందని, ఎన్నోకొన్ని సీట్లు తీసుకోవచ్చు కదా అంటూ ఆయనపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో శివశంకర్‌ కిందపడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అలిగి విజయవాడకు ఆయన వెళ్లిపోయారు. ఘటనపై పవన్‌ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం.

అసహనంతో రగిలిపోయి..

జనసేన రాష్ట్రస్థాయి నేతల నిలకడలేనితనంతో ఆ పార్టీ నేతలు రోడ్డునపడ్డారు. వాస్తవానికి 32 డివిజన్లలో నామినేషన్లేశారు. 21 మందికి బీ ఫారాలను తొలుత అందజేశారు. అయితే చివరికి ఎనిమిది సీట్లనే టీడీపీ ఇచ్చిందని, తాము చెప్పిన వారు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. సిటీలో 6, 15, 21, 71.. రూరల్‌లో 29, 30, 45, 53 డివిజన్లను కేటాయించారు. దీంతో మిగిలిన అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. తమను బలిపశువులను చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

మేయర్‌ అభ్యర్థి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

జనసేన మేయర్‌ రెబల్‌ అభ్యర్థి కాకు మురళి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. మరికొందరు సైతం ఇలానే వ్యవహరించి.. తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఫలితంగా ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంది.

30 శాతం సీట్లకు పట్టుబట్టిన జనసేన

అన్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన టీడీపీ

దిక్కుతోచక బిక్కమొహం

చివరికి వారు విదిల్చిన వాటికే అంగీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement