ప్రభుత్వం పట్టించుకోలేదు.. సత్తా చూపుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం పట్టించుకోలేదు.. సత్తా చూపుతాం

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

● కాంట్రాక్ట్‌ వైద్యసిబ్బంది

● నర్సుల సమ్మెతో రోగుల విలవిల

● నర్సింగ్‌ విద్యార్థినులతో సేవలు

నెల్లూరు(అర్బన్‌): ‘మమ్మల్ని రెగ్యులర్‌ చేయాలని, అంతవరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలని నెలరోజులకు పైగా వివిధ రూపాల్లో శాంతియుతంగా ఆందోళన చేశాం. ప్రభుత్వం మంచి చేస్తుందని ఆశించాం. అయినా పట్టించుకోలేదు. అందువల్ల మా సత్తా ఏంటో చూపిస్తాం’ అని ఏపీ మెడికల్‌, హెల్త్‌ కేర్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రూత్‌ గ్రేస్‌ తెలిపారు. వైద్యశాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, రేడియాలజీ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, దంత, నేత్ర, ఈసీజీ టెక్నీషియన్లు మంగళవారం జిల్లా వ్యాప్తంగా తమ విధులు బహిష్కరించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా నెల్లూరులోని సర్వజన ఆస్పత్రికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రూత్‌ గ్రేస్‌ మాట్లాడుతూ తాము అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నామన్నారు. అరకొర వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక అప్పులపాలవుతున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతానికి వార్డు సేవలు బంద్‌ చేశామని, ప్రభుత్వం స్పందించకపోతే ఎమర్జెన్సీ సేవలు కూడా బుధవారం నుంచి నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నెల్లూరు జేఏసీ చైర్మన్‌ శరత్‌బాబు, కన్వీనర్‌ షాజి, కోశాధికారి రత్న, లీనాకుమారి, రవితేజ, గోపీకృష్ణ, శ్రీలత, వీరనారాయణ, జగదీష్‌, సుసన్న, స్పందన తదితరులు పాల్గొన్నారు.

రోగుల ఇబ్బందులు

జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 మందికి పైగా స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ , ఇతర టెక్నీషియన్లు, నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే 305 మంది సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వార్డుల్లో అడ్మిట్‌ అయిన రోగులకు సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ వార్డులో చూసినా నర్సింగ్‌ కోర్సులో చేరిన విద్యార్థినులే వైద్య సేవలందిస్తున్నారు. వారికి సక్రమంగా చేతికి సూది కూడా పెట్టడం రావడం లేదు. దీంతో మూడు, నాలుగు సార్లు నీడిల్‌తో గుచ్చుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు రాసిచ్చిన మందులు సక్రమంగా రోగికి ఇవ్వాలన్నా అనేక మంది నర్సింగ్‌ విద్యార్థినులకు అర్థంకాని పరిస్థితి ఉంది.

● ఈ విషయమై ప్రభుత్వ పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. రెగ్యులర్‌ స్టాఫ్‌, ఇతర ఆస్పత్రుల నుంచి స్టాఫ్‌ను తీసుకుని రోగులకు సేవలందిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement