మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 504 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 643 బేళ్లు రాగా వాటిలో 504 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించారన్నారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.250 కాగా కనిష్ట ధర రూ.110 లభించింది. మొత్తమ్మీద సగటు ధర రూ.181.53గా నమోదైంది. వేలంలో పది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.250
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 598 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 480 బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 118 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.110 పలకగా, సరాసరి రూ.185.91 లభించిందన్నారు. వేలంలో 11 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
తొమ్మిదిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు
నెల్లూరు (టౌన్): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ – 14 బాలబాలికల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్నామని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ మల్లికార్జునరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ – 14, 17 విభాగాల బాలబాలికలకు రైఫిల్ షూటింగ్ సెలక్షన్స్‌ను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అండర్ – 19 బాలబాలికల రైఫిల్ షూటింగ్ ఎంపికలను నగరంలోని డైకస్‌రోడ్డులో పదిన జరపనున్నామన్నారు.
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2026 – 27 సంవత్సరానికి గానూ రెండేళ్ల అలైడ్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ రాజేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్ అభ్యర్థులకు 85.. నాన్ లోకల్ అభ్యర్థులతో 15 శాతం చొప్పున సీట్లను భర్తీ చేయనున్నామని వెల్లడించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపల్ కార్యాలయంలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఐదులోపు సమర్పించాలని కోరారు. అప్లికేషన్ ఫీజుగా రూ.వందను చెల్లించాలని.. కోర్సుల వివరాలు, దరఖాస్తులు, జత చేయాల్సిన పత్రాలపై spsnellore. ap. gov. in/ notice/ recruitmentను పరిశీలించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 83,252 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 28,683 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.56 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


