సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అత్యంత ప్రామాణికాలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘గోరు ముద్ద’ను.. కూటమి ప్రభుత్వం ‘ఘోర ముద్ద’గా మార్చేసింది. ‘డొక్కా సీతమ్మ’ పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంతో పేద పిల్లలు ‘డొక్కలు మాడ్చుతున్నారు’. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందజేస్తున్న భోజనం నాసిరకంగా ఉంటుంది. విద్యార్థులకు నాణ్యత, పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాల్సిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేజీబీవీలు, పాఠశాలల హాస్టల్స్‌ల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా విద్యార్థులకు అందజేసే మెనూ చార్జీలు పెంచకుండా చోద్యం చూస్తోంది. కేజీబీవీలతోపాటు పాఠశాలల్లో అందజేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం మరింత నాసిరకంగా మారింది. కోడిగుడ్లు, చిక్కీల్లో నాణ్యత లోపించడం, కాలం చెల్లిన వాటిని అందజేస్తుండడంతో విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ప్రధానంగా కేజీబీవీల్లో నాసిరకం భోజనంపై ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే వారికి ఛీదరింపులు, బెదిరింపులు తప్పడం లేదు. కేజీబీవీ నిర్వాహకులు మెనూ సక్రమంగా అమలు చేయకుండా నాణ్యత లోపించిన భోజనాన్ని పెడుతున్నారు. ఇటీవల కలిగిరిలోని కేజీబీవీలో విద్యార్థులకు పురుగులు పట్టిన అల్పహారాన్ని అందజేశారు. దీనిపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కేజీబీవీ ప్రిన్సిపల్, వంట మనుషులను ప్రశ్నించారు. ఇటీవల నందిపాడులోని కేజీబీవీలో కుళ్లిన కోడిగుడ్లును విద్యార్థులకు అందజేశారు. వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్ 15 లేదా 20 రోజులకు ఒకసారి సరఫరా చేయడంతో గుడ్లు కుళ్లి పోతున్నట్లు చెబుతున్నారు. కేజీబీవీలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేజీబీవీలు, పాఠశాలల్లో నాణ్యతతో కూడి పౌష్టికాహార భోజనాన్ని అందించే వారు. నాణ్యత ఎక్కడ లోపించకుండా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించే వారు.
కేజీబీవీల్లో నాసిరక భోజనం
జిల్లాలో 7 కేజీబీవీలు ఉన్నాయి. వాటిల్లో కొండాపురం, కలిగిరి, నందిపాడు, ఏఎస్‌పేట, మర్రిపాడు, సీతారామపురం, కావలి ప్రాంతాల్లో కేజీబీవీలు ఉన్నాయి. ఆయా కేజీబీవీల్లో మొత్తం 1960 మంది విద్యార్థినులు ఉన్నారు. ఒక్కో విద్యార్థినికి నెలకు రూ.1600 కేటాయిస్తున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే బెల్లం, పాలతో రాగిజావ, బ్రేక్ పాస్ట్ తరువాత పూరీ, ఆలు బఠాని కుర్మా, పల్లీల చట్నీ, మధ్యాహ్న భోజనంలో అన్నం, గోంగూర పప్పు, గుడ్డు పొరుటు, రసం, మజ్జిగ, సాయంత్రం స్నాక్స్ సగ్గుబియ్యం, బెల్లం పాయసం, రాత్రి భోజనంలో అన్నం, వంకాయ కూర, సాంబారు, మజ్జిగ అందించాల్సి ఉంది. భోజనం తరువాత ప్రతి రోజు అరటి పండు ఇవ్వాల్సి ఉంటుంది. స్నాక్స్ సమయంలో బూస్ట్ కలిపిన పాలు, స్వీట్ కార్న్, బొబ్బర్లు, మరమరాలు, ఉడకబెట్టిన పచ్చి బఠాని, బిస్కెట్లు, ఉడకబెట్టిన శనగలు వీటిల్లో ఏవైనా రెండు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ మెనూ ప్రతి రోజూ మారుతూ ఉంటుంది. కేజీబీవీల్లో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రధానంగా కోడిగుడ్లు, చిక్కీలు నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. కేజీబీవీల్లో నాణ్యత లేని భోజనం, నాసి రకంతో కూడిన కోడిగుడ్లు, చిక్కీలపై ఫిర్యాదులు వస్తున్నా.. అధికారులు, కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
1,73,847 మందికి మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందజేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2033 ప్రాథమిక, 256 ప్రాథమికోన్నత, 287 ఉన్నత పాఠశాలల్లో 1,73,847 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నెల్లూరు అర్బన్ పరిధిలోని 91 పాఠశాలల్లో ఇస్కాన్ సంస్థ, వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, మండలాల్లోని 204 పాఠశాలల్లో అక్షయ పాత్ర, 2,228 పాఠశాలల్లో ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.6.19, 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులకు రూ.9.69 భోజనం కోసం ఖర్చు చేస్తున్నారు.
ఉడకని అన్నం, నీళ్లు సాంబారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉడకని అన్నం, నీళ్లు సాంబారు విద్యార్థులకు అందజేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకనుగుణంగా మధ్యాహ్న భోజన చార్జీలు పెంచలేదు. దీంతో భోజన నిర్వాహకులు నాసిరకంతో కూడిన భోజనాన్ని వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రైస్, కూరగాయల సాంబారు, ఎగ్ ఫ్రై, చిక్కీ, మంగళవారం లెమన్ రైస్, టమోటా లేదా పుదీనా చట్నీ, ఫ్రైడ్ ఎగ్, రాగిజావ, బుధవారం రైస్, మిక్సిడ్ విజిటేబుల్ కర్రీ (4 కూరగాయలకు తగ్గకుండా), ఎగ్‌ఫ్రై, చిక్కీ, గురువారం విజిటేబుల్ రైస్ లేదా పులావు, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్, రాగిజావ, శుక్రవారం రైస్, ఎగ్ కర్రీ, చిక్కీ, శనివారం రైసు, టమోటో పప్పు లేదా పప్పు చారు, స్వీట్ పొంగల్, రాగిజావను ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు పాఠశాలలను ‘సాక్షి’ బృందం పరిశీలించింది. మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. భోజనం సమయంలో చిక్కీలు ఇవ్వడం లేదు. దీనిపై అడిగితే మధ్యాహ్నం తర్వాత తరగతి గదిలో ఇస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కోడిగుడ్లును అడిగిన విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నారు. రైస్‌తోపాటు కూరలు అధ్వానంగా ఉంటున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి దగ్గర నుంచే క్యారేజీలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 60 శాతం పైగా విద్యార్థులకు ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది పాఠశాలకు వచ్చే సమయంలో తెచ్చుకుంటే మరి కొంత మందికి మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు క్యారేజీని తీసుకు వస్తున్నారు. క్యారేజీలు ఎందుకు తెచ్చుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నిస్తే పాఠశాలలో పెట్టే భోజనం బాగలేదని, అందుకే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. నిత్యావసర సరుకులు ధరలు, పెరిగినందున ఇంతకంటే భోజనం పెట్టలేమని నిర్వాహకులు చెబుతున్న మాట. మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖాధికారులకు కార్యాలయాలకే పరిమితవుతున్నారు. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తక్కువ మంది తిన్నా 90 శాతం మంది తిన్నట్లు లెక్కలు చూపి హెడ్‌మాస్టర్లు, మధ్యాహ్న భోజన పర్యవేక్షకులు, భోజన నిర్వాహకులు కలిసి దోచుకుంటున్నారని తెలిసింది.
కేజీబీవీలో బాధ్యులకు మెమోలు జారీ చేశాం
కలిగిరి కేజీబీవీలో ఇటీవల విద్యార్థులకు పురుగులు పట్టిన అల్పహారాన్ని అందించిన ఘటనలో ఇద్దరు వంట ఉద్యోగులు, ప్రిన్సిపల్‌కు మెమోలు జారీ చేశాం. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలి. దీన్ని ఎవరైనా ఉపేక్షిస్తే ఊరుకునేది లేదు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి.
– వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష
కలిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది వర్గాలు విడిపోయారు. ఆ ప్రభావం విద్యాలయంలోని విద్యార్థినులపై పడుతుంది. ఇటీవల విద్యాలయంలో ఆహారంలో తరచు పురుగులు వస్తున్నాయని, వసతులు సక్రమంగా ఉండడం లేదని కొంతమంది విద్యార్థినులు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విచారణ చేపట్టిన డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య కూడా అల్పాహారంలో పురుగులు వచ్చిన విషయాన్ని నిర్ధారించారు. ఈ విషయం రచ్చకెక్కడంతో ప్రిన్సిపల్‌తోపాటు కొంతమంది ఉపాధ్యాయులు ప్రతి తరగతికి వెళ్లి ఇకపై విద్యాలయంలో జరుగుతున్న విషయాలను తల్లిదండ్రుల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకెళ్లకుండా కఠినంగా చర్యలు చేపట్టాలని హెచ్చరించినట్లు సమాచారం. ఉపాధ్యాయులు, సిబ్బంది వర్గాలు విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వారు వర్గాలు విడిపోయి ఎవరికి వారు విద్యార్థినుల కూడా తమపై తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


