అపూర్వం.. అమ్మ తేజం | - | Sakshi
Sakshi News home page

అపూర్వం.. అమ్మ తేజం

Oct 1 2026 12:11 AM | Updated on Oct 1 2026 12:11 AM

వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి పట్టణం భక్తజన సంద్రంగా మారింది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నాలుగో ఏడాది సైతం జాతర కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వెంకటగిరి వాసులు భారీ సంఖ్యలో జనజాతరకు హాజరయ్యారు. వేడుకను ప్రత్యక్షంగా తిలకించి ఆనవాయితీ ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. పోలేరమ్మ తల్లి దీవెనల కోసం పట్టణానికి ఇసుక కేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తున్నారు.

తొలుత పుట్టింటి నుంచే..

పోలేరమ్మ తల్లికి పుట్టినిల్లు అయిన కుమ్మరివీధిలోని ఇంటి వద్ద మహిమాన్విత ప్రతిమను తయారు చేసి బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. ఈ సందర్భంగా వెంకటగిరి రాజకుటుంబీకులు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ వస్త్రాలనే అపూర్వ తేజంతో విరాజిల్లుతున్న పోలేరమ్మతల్లికి అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అమ్మవారి ప్రతిమను తయారు చేసిన వెంటనే దర్శించుకుంటే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుట్టినిల్లు కుమ్మరింట్లో అమ్మవారికి కళ్లు, బుగ్గచుక్క పెట్టకపోవడం ఆనవాయితీ. భక్తులు పుట్టినింటిలో పోలేరమ్మను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక రథంపై అమ్మవారిని కొలువుదీర్చి ఊరేగింపుగా జీనిగలవారి వీధికి తీసుకెళ్లారు.

భక్తిశ్రద్ధలతో కళ్లు.. బుగ్గచుక్క

జీనిగలవారి వీధిలో అమ్మవారిని ప్రతిష్టించి సంప్రదాయబద్ధంగా గాలి గంగులకు పూజలు నిర్వహించారు. వెంటనే కోడిని బలి ఇచ్చి అమ్మవారికి కళ్లు, బుగ్గ చుక్కను అత్యంత భక్తిశ్రద్ధలలో తీర్చిదిద్దారు. అనంతరం పోలేరమ్మను విశేషంగా అలంకరించి ప్రత్యేక రథంపై కొలువుదీర్చారు. జీనుగలవారి వీధి నుంచి ఊరేగింపుగా పాతకోట ఆంజనేయస్వామి గుడి మీదుగా పోలేరమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. పవిత్ర ఆలయం వద్ద వేపఆకులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గ్రామదేవతను అధిష్టింపజేశారు. గురువారం వేకువజాము నుంచే పోలేరమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

భక్తుల నినాదాలతో..

జన జాతరలో భాగంగా వెంకటగిరిలోని ప్రతివీధి కళకళలాడుతోంది. పోలేరమ్మకు మడి భిక్షం పెట్టండి.. పోతురాజుకు టెంకాయ కొట్టండి.. అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తుతోంది. పురవీధుల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా మడి భిక్షాటన చేపట్టారు. ప్రతి ఇంట్లో పసుపు ప్రతిమను తయారు చేసి పూజలు నిర్వహించారు. అంబలిని నైవేద్యంగా సమర్పించారు.

నేడు నగరోత్సవం

జాతరలో భాగంగా గురువారం వేకువజామున అమ్మవారి నిలుపుతో జన జాతర మొదలైంది. సాయంత్రం వరకు భక్తుల దర్శనార్థం పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక మండపంలోనే ఉంచుతారు. అనంతరం ప్రత్యేక రథంపై కొలువుదీర్చి అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తారు. ఊరేగింపు తర్వాత విరూప మండపం వద్ద గ్రామదేవత నిష్క్రమణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ చెంచుబాబు, సీఐ రోశయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

పార్కింగ్‌ స్థలాలు

జాతర సందర్భంగా పట్టణంలోని వాహనాల పార్కింగ్‌కు ఏడు స్థలాలను ఏర్పాటు చేశారు. విశ్వోదయ క్రీడా ప్రాంగణం, కుమ్మరిగుంట, ఈఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాల ఎదురుగా, హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌ సమీపంలో స్థలాలను సిద్ధం చేశారు.

1,200 మంది పోలీసులతో బందోబస్తు

జాతరకు 1,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు. సీసీ కెమెరాలతో కట్టుదిట్టంగా నిఘా పెట్టినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు సైతం అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

106 ప్రత్యేక బస్సులు

జాతరకు తిరుపతి, రాజంపేట, శ్రీకాళహస్తి, నెల్లూరు, గూడూరు, రాపూరు డిపోల నుంచి వెంకటగిరికి ప్రత్యేకంగా 106 బస్సులను గురువారం నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

యథేచ్ఛగా మద్యం విక్రయాలు

వెంకటగిరిలో నిబంధనలకు విరుద్ధంగా బుధవారం మద్యం విక్రయాలు సాగాయి. గతంలో అమ్మవారి జాతర సందర్భంగా బుధ, గురువారాల్లో వైన్‌ షాపులకు సీల్‌ వేసేవారు. ప్రస్తుతం యథేచ్ఛగా మద్యం అమ్ముతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటగిరిలో పోలేరమ్మ జాతర వైభవంగా ప్రారంభించారు. గ్రామదేవతకు అట్టహాసంగా రథోత్సవం నిర్వహించారు. చలువ పందిరి నీడన అమ్మవారిని కొలువుదీర్చారు. రాష్ట్ర పండగలో పాలుపంచుకునేందుకు దేశవిదేశాల్లో స్థిరపడిన పట్టణవాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా మహోత్సవం జరుపుకొంటూ మొక్కులు చెల్లించుకున్నారు.

వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర

వేప మండల చలువ పందిరిలో

కొలువుదీరిన గ్రామదేవత

కనులపండువగా రథోత్సవం

భక్త జనసంద్రంగా మారిన

వెంకటగిరి పట్టణం

నేడు నగరోత్సవం.. నిమజ్జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement