● స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తాం
● మాజీమంత్రి కాకాణి
మనుబోలు: బీసీలకు రాజ్యాధికారం పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బీసీ జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే పేదలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే ప్రస్తుతం పింఛన్ల పేరుతో ప్రచారార్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. వీబీజీరామ్‌జీ పేరుతో రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతూ కార్యక్రమాలు, ఈవెంట్లకు రూ.46 కోట్లు దుబారా చేశారని మండిపడ్డారు. సాగునీటిని ఈ ప్రభుత్వం వృథా చేయడం వల్లే ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారని, అయితే ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ముందు మనుబోలులో పార్టీ నాయకుడు గిద్దంటి రమణయ్య సోదరుడు రఘురామయ్య, బీసీ కాలనీలో కార్యకర్త నవకుమార్ తల్లి, అంబేడ్కర్‌నగర్‌లో కార్యకర్త బళ్ల శ్రీనివాసులు మృతి చెందిన నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కాగితాలపూరులో ఇద్దరి కుటుంబాలను పరామర్శించారు. పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, ముంగర రవీంధర్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, చిట్టమూరు అజయ్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, దువ్వూరు సుధాకర్‌రెడ్డి, కేవీఆర్‌గౌడ్, కోటేశ్వరగౌడ్, వజ్రమ్మ, గిరి తదితరులున్నారు.


