నెల్లూరు(పొగతోట): కొత్తగా పింఛన్లు పొందాలంటే అర్హతే ప్రామాణికం కాదు. పచ్చ నేతలు సూచించిన వారికే వీటిని మంజూరు చేయనున్నారు. నూతనంగా అందుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలనే ప్రభుత్వ ప్రకటనతో ఎంతో మంది ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సచివాలయాలకు పరుగులు తీశారు. అయితే టీడీపీ నేతలు సూచించిన వారికే ఇవి లభించనున్నాయని తెలుసుకొని వీరు మండిపడుతున్నారు.
భారీగా అప్లికేషన్లు
పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 64,865 మంది అప్లయ్ చేశారు. సచివాలయాల నుంచి పూర్తి లెక్కలొస్తే ఇది మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు వీటి దాఖలు విషయంలోనూ ప్రభుత్వం విచిత్రంగా వ్యవహరించింది. వాస్తవానికి ఈ నెల ఏడు నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని తొలుత ప్రకటించింది. ఈ పది రోజుల్లో శని, ఆదివారాలు.. వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఇది కాకుండా సర్వర్ సమస్యలతో కాలం గడిచిపోయింది. ఈ పరిణామాల క్రమంలో 18 వరకు గడువును పొడిగించింది. ఫలితంగా దరఖాస్తులు భారీగా అందినా, వీరిలో అదృష్టవంతులెవరో సైకిల్ పార్టీ నేతలే ఖరారు చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా, ఏ అంశాల ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారో సర్కార్‌కే ఎరుక. వయస్సు, పరిస్థితులు, అవసరాలు, వ్యాధులు తదితరాలను ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేస్తే, అర్హులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే ఇలా జరగడం గగనంగా కనిపిస్తోంది.
వైఎస్సార్సీపీ మద్దతుదారులపై వివక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు సంక్షేమ పథకాలను అందించొద్దంటూ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో వీరిపై వివక్ష చూపుతూ నోటి వద్ద ముద్దను సర్కార్ లాగేస్తోంది. అదే గతంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ పింఛన్లను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ కర్కశ పాలనలో ఇవేవీ మచ్చుకై నా కానరావడంలేదు.
చిక్కులతో చుక్కలు
నూతన పింఛన్లను అందజేస్తామని సర్కార్ ప్రకటించినా, క్షేత్రస్థాయిలో రకరకాల చిక్కులను విధించింది. దివ్యాంగులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులకు సర్టిఫికెట్లను అడ్డుగా పెట్టింది. దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్లున్నా, వాటిలో పూర్తి సమాచారం లేదని.. ఆధార్ నంబర్ కనిపించడంలేదనే సాకులతో నరకాన్ని చూపింది. దీంతో అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు.
నెల్లూరులో అధికంగా..
నెల్లూరు సిటీ, రూరల్ పరిధి నుంచి దాదాపు 13,578 దరఖాస్తులు రాగా, ఇందులో 4250కు ఆమోద ముద్ర లభించింది. కావలిలో 4450.. గూడూరులో 3200.. బుచ్చిరెడ్డిపాళెంలో 3100.. ఆత్మకూరులో 2100 అప్లికేషన్లొచ్చాయి.
కేటగిరీ వచ్చిన పెండింగ్ మంజూరైనవి తిరస్కరణకు
అప్లికేషన్లు గురైనవి
ట్రాన్స్‌జెండర్ 34 34 – –
ఒంటరి మహిళ 450 446 – 4
చేనేత 712 706 – 6
కల్లుగీత కార్మికులు 1140 1133 – 7
మత్స్యకారులు 2083 2082 – 1
డప్పు కళాకారులు 2608 2608 – –
చర్మకారులు 2946 2934 – 12
దివ్యాంగులు 6508 5608 856 44
వితంతువులు 14,547 12,600 1783 164
వృద్ధాప్య 33,837 30,107 3345 385
మొత్తం 64,865 58,258 5984 623
అర్హతే ప్రామాణికం కాదు
పచ్చ నేతలు సూచించిన
వారికే మంజూరంట..!
ముగిసిన దరఖాస్తు గడువు
మొత్తం 64,865 అప్లికేషన్లు
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ 27 నెలల్లో ఒక పింఛన్‌ను సైతం మంజూరు చేసిన దాఖలాల్లేవు. ఈ తరుణంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏదో కొత్తగా ఇస్తామని.. దీనికి దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ ప్రకటించింది. ఇంకేముంది తమకు అందుతుందనే కొండంత ఆశతో అనేక మంది అర్హులు అప్లయ్ చేశారు. అయితే ఇక్కడే వీరికి కొత్త చిక్కొచ్చిపడింది. పచ్చ నేతలు సూచించిన వారికే కొత్తగా లభించనున్నాయని తెలిసి ఎంతో మంది హతాశులయ్యారు. ఇంత దానికి తమను ఊరించి.. ఉసూరుమనిపించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.


