ప్రకృతిని.. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి పచ్చనేతల ఇసుక మాఫియా సాగిస్తున్న విధ్వంసంతో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలతోపాటు చైన్నె మహా నగరానికి పెను ముప్పు పొంచి ఉంది. జిల్లాకే జీవనాడి అయిన సోమశిల ప్రాజెక్ట్ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఇసుక తవ్వకాలకు ఉన్న నిబంధనల సంకెళ్లు తెంచి.. పర్యావరణ పరిరక్షణను పాతరేసి.. నదీ గర్భాన్నే తవ్వేందుకు అధికార యంత్రాంగమే అనుమతుల్విడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసుక తవ్వకాలకు ఆంక్షలు ఉన్నా.. నదిలోకి భారీ యంత్రాలను దింపి, వందలాది టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నా, నదీ ప్రవాహానికి అడ్డంగా పక్కా రోడ్లు నిర్మించినా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం.. మహా విపత్తుకు దారితీస్తోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుక మాఫియా ధన దాహం.. అధికార యంత్రాంగం అవినీతి పాపం మహా ప్రళయానికి దారి తీయనుంది. జిల్లా జీవనాడి సోమశిల ప్రాజెక్ట్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉంది. ప్రాజెక్ట్‌కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్ (పర్యావరణ సున్నిత ప్రాంతం) పరిధిలోకి వస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదు. కానీ అధికారులు అడ్డగోలుగా అనుమతులిచ్చి ఇసుక దోపిడీకి అండగా నిలుస్తున్నారు. సంగం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో డీసిల్టింగ్ పేరుతో అనుమతులు తీసుకుని, ప్రాజెక్ట్‌కు అత్యంత సమీపంలో భారీ యంత్రాలు పెట్టి ప్రకృతి, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ.. నదీ గర్భాన్ని చీల్చేస్తున్నారు. మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారుల అండదండలతో జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం, అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులో ఈ తరహా దందా యథేచ్ఛగా జరుగుతోంది.
దోపిడీలో సగం వాటా షాడో ఎమ్మెల్యేకే..
వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి సతీమణి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆమె కనుసన్నలో కలువాయి మండలం రాజుపాళెం వద్ద పెన్నానదిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. నెలకు రూ.కోట్ల ముడుపులు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఆమె అనధికారికంగా ఇసుక తవ్వకాలు, అక్రమ గ్రావెల్ తోలకాల్లో ఆరితేరిన వ్యక్తికి అనుమతులిచ్చారు. మేడం చెప్పిందే తడువుగా ఇరిగేషన్ అధికారులు మానవశక్తితో డీసిల్టేషన్ పేరుతో అనుమతులు ఇచ్చేశారు. ఇక్కడి నుంచి రోజుకు 120–140 టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్‌కు 45 నుంచి 50 టన్నులు లోడింగ్ చేస్తున్నారు. టన్ను రూ.350 లెక్కన సగటున రోజుకు 6000 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు అంచనా. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.20 లక్షలు, నెలకు రూ.60 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.
పర్యావరణాన్ని దెబ్బతీస్తూ..
వాస్తవానికి ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అధికారిక అనుమతి లేదు. ఎక్కడో అనుమతులు తీసుకుని ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఆ అనుమతుల ప్రకారం కేవలం మనుషులతో డీసిల్టింగ్ చేపట్టాల్సి ఉంది. నది నుంచి వెలికి తీసిన ఇసుకను కుల్లూరు సమీపంలోని స్టాక్ పాయింట్‌కు తరలించి విక్రయించాల్సి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా నదీ గర్భంలో ఐదు భారీ యంత్రాలు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కోల్, గోల్డ్ మైన్లను తలపించే రీతిలో 20–30 అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు చేపట్టి.. అక్కడి నుంచి టిప్పర్లతో ఇసుకను తరలించేందుకు ఏకంగా మెటల్ రోడ్డును నిర్మించారు. నదిలో సహజ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు నిర్మాణం చేయడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయోందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తరుణంలో భారీ ప్రవాహం వస్తే.. ఈ అడ్డు కట్ట కారణంగా నీరు నదీ తీరంలోని గ్రామాల వైపు వరద మహాప్రళయంగా విరుచుకుపడే అవకాశం ఉందని, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం మాఫియా ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి ప్రజాజీవనానికి ముప్పు ఉందని తెలిసీ కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి..
సోమశిల ప్రాజెక్ట్ ఎకో సెన్సిటివ్ జోన్‌లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు
ఇక్కడ అనుమతులివ్వడం..
ఎన్‌జీటీ నిబంధనలకు విరుద్ధం
పచ్చనేతల ఇసుక మాఫియాతో ప్రాజెక్ట్‌కు పెనుముప్పు
కలువాయి మండలం రాజుపాళెంలో షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో దందా
అనంతసాగరం మండలం
పీకేపాడులో ఆనం అనుచరుల దోపిడీ
అక్టోబర్ 15 వరకు నిషేధానికి అధికార యంత్రాంగం తూట్లు
ప్రజాప్రతినిధులు, అధికారులకు రూ.కోట్లల్లో నెల మామూళ్లు
అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులో అనధికారిక రీచ్ నుంచి రెండున్నర ఏళ్లుగా ఇసుక దోపిడీ కొనసాగుతుంది. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి కీలక అనుచరుడే ఇసుక దందా చేస్తున్నారు. ఈ రీచ్ సైతం సోమశిల ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి రావడంతో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకుండానే నదీ గర్భాన్ని చీల్చేసి.. పిండేస్తున్నారు. నిత్యం ఇక్కడి నుంచి వందల టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నెలకు సగటున రూ.100 కోట్ల మేర ఇసుక దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఇసుక తవ్వకాలు చేస్తున్నా ఏ అధికారి కూడా నిలువరించ లేకపోవడంతోపాటు మాఫియాతో అంటకాగుతూ నెల మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


