చంద్రబాబు.. కరువూ.. కవలలు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. కరువూ.. కవలలు

Sep 18 2026 11:58 PM | Updated on Sep 18 2026 11:58 PM

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం

ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి

నెల్లూరు రూరల్‌: చంద్రబాబు అధికారంలోకి రావడం.. కరువు ఏర్పడటం.. ఈ రెండూ కవలలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. ప్రజలు, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 4న మాట్లాడినా, ఆ తర్వాత కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

జిల్లాలో 40.5 శాతం వర్షలోటు

జిల్లాలో జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 16 వరకు సాధారణ వర్షపాతం 256.9 మిల్లీమీటర్లు కాగా, 152.8 మిల్లీమీటర్ల మేరే నమోదైందని, 40.5 శాతం లోటుందనే విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని చెప్పారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సాయాన్ని రైతులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ వ్యవధి పంటల విత్తనాల కోసం కంటింజెన్సీ ప్లాన్‌ను సిద్ధం చేయలేదని విమర్శించారు.

నీటి నిల్వలు తగ్గుముఖం

సోమశిలలో 13.. కండలేరులో 17 టీఎంసీలే ఉన్నాయని.. పంటల సాగు, డెడ్‌ స్టోరేజ్‌, ఆవిరి నష్టాలను మినహాయిస్తే వినియోగానికి సుమారు పది టీఎంసీలే మిగలనున్నాయని, భవిష్యత్తులో తాగునీటి సమస్యా తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. జిల్లాలో నీటి నిర్వహణలో లోపాలు.. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయ లేమి కారణంగా రైతాంగానికి దాదాపు రూ.మూడు వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. మొదటి పంట సాగు విస్తీర్ణం అధికారికంగా 5.2 లక్షలెకరాలు, అనధికారికంగా మరో 50 వేల ఎకరాలున్నాయని తెలిపారు. రెండో పంట ఎంత సాగవుతుందో ముందుగా అంచనా వేయకుండా.. గ్రామాల వారీగా అన్నదాతలు, రైతు సంఘాలతో చర్చించకుండా నీటిని విడుదల చేశారని విమర్శించారు. ఫలితంగా రెండో పంట సాగు విస్తీర్ణం 1.8 లక్షలెకరాలకే పరిమితమైందని చెప్పారు.

జలాలను విడుదల చేయాలి

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880 అడుగులకుపైగా ఉన్నప్పుడే జిల్లా రైతాంగానికి నీటిని విడుదల చేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అక్కడ్నుంచి నిత్యం 11 వేల క్యూసెక్కులను విడుదల చేస్తే, జిల్లాకు సుమారు టీఎంసీ నీరందుతుందని తెలిపారు. కలువాయి మండలంలో సకాలంలో నీరందక సుమారు నాలుగు వేలెకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నీటి కోసం ఒత్తిడి తెచ్చేందుకు నెల్లూరు బ్యారేజీ వద్దకెళ్లిన మాజీ మంత్రి శైలజానాథ్‌ తదితరులను అడ్డుకొని కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్‌కు భయపడి శ్రీశైలం నీటి అంశంపై కూటమి నేతలు నోరు మెదపడంలేదని విమర్శించారు. గతంలో సభలు, సమావేశాల్లో ఆర్భాటంగా మాట్లాడిన వీరు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రైతులను అడ్డం పెట్టుకొని దోపిడీకి కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. నిర్వహణ, మరమ్మతుల పేర్లతో రూ.వందల కోట్ల పనులను మంజూరు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో నీరు – చెట్టు తరహాలోనే ఇప్పుడూ కొత్త పేర్లతో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా, అనధికారిక కోతలు విధిస్తున్నారని దుయ్యబట్టారు. బోర్లపై ఆధారపడిన ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.

పంటల బీమాను పునరుద్ధరించాలి

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ – క్రాప్‌ ఆధారంగా ఉచిత పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. అయితే రైతులపై ప్రీమియం భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోపడంతో, నష్టపోయిన అన్నదాతలకు పరిహారం అందడంలేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.19 వేలనే అందించారని వివరించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు గతంలో మాదిరిగా 80 శాతం సబ్సిడీతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో లేకపోయినా తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిస్థితులపై మూడు గంటలకుపైగా జూమ్‌ సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాటానికి జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమవుతుంటే, అధికారంలో ఉన్న చంద్రబాబు మాత్రం సరైన సమీక్షలను నిర్వహించడంలేదని విమర్శించారు. రైతులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement