చిల్లకూరు: అర్హతుండి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయానికి పది మంది మత్స్యకారులెళ్లగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే ఏకై క కారణంతో వాటిని ఆన్‌లైన్ చేసేందుకు అనేక కొర్రీలను అక్కడి సిబ్బంది పెట్టారు. ఈ పరిణామంతో ఏమి చేయాలో పాలుపోని మత్స్యకార సొసైటీ సభ్యులు.. ముత్యాలపాడు సచివాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనను శుక్రవారం చేపట్టారు. వాస్తవానికి ముత్యాలపాడు చెరువు సొసైటీలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మత్స్యకార కుటుంబాలు దాదాపు 150 ఉన్నాయి. అయితే దరఖాస్తు నిమిత్తం వీరిలో కొందరు వెళ్లగా, సచివాలయం వద్ద కర్కశంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న తమకు మత్స్యశాఖ గుర్తింపు కార్డులు సైతం ఉన్నాయని చెప్పారు. అయితే సొసైటీ జాబితాను తీసుకురావాలని మత్స్యశాఖ అసిస్టెంట్ చెప్తున్నారని సచివాలయ సిబ్బంది తెలిపారన్నారు. ఈ వివరాలు అక్కడే ఆన్‌లైన్లో ఉండగా, తమను తేవాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. ఆన్‌లైన్ చేయాలంటే గ్రామంలోని అధికార పార్టీ నేతలు సిఫార్సు చేయాలన్నారని ఆరోపించారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాకపోవడంతోనే ఇలా అడ్డంకులను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై ఎంపీడీఓ వెంకట్రావ్‌ను సంప్రదించగా, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తన వద్దకు దరఖాస్తులే తేలేదని చెప్పారు. సొసైటీలో సభ్యత్వం ఉన్న జాబితాలను మత్స్యశాఖ జేడీ పరిశీలించి సిఫార్సు చేయాలని చెప్పారని, దీని కోసం చూస్తున్నామని ఫిషరీస్ అసిస్టెంట్ బదులిచ్చారు.


