నెల్లూరు(అర్బన్): వైద్యారోగ్య శాఖలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు శుక్రవారం నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి ఐపీ భవనం ఎదుట నల్లదుస్తులు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్‌గ్రేస్, చైర్మన్ శరత్‌బాబు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనలు విరమించేది లేదన్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో నిరసనలు చేపట్టి తమ బాధలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి త్వరితగతిన తమతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వేణు, శేషగిరి, లక్ష్మి పాల్గొన్నారు.


