పొదలకూరు: యాభై ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులు కొత్త పింఛన్ల కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే సర్కార్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వీరి పాలిట కష్టంగా మారుతున్నాయి. వాస్తవానికి జిల్లాలో నూతన పెన్షన్ల కోసం సుమారు వెయ్యి మంది వరకు నిరీక్షిస్తున్నారని అంచనా. మరోవైపు వీటిని పొందుతున్న వారు దాదాపు 3500 మంది ఉన్నారు. అయితే దరఖాస్తు దాఖలులో కొర్రీలను విధించారు.
ఇవేమి నిబంధనలో..?
● నేత పనిలో కనీసం 15 దినాలు పాల్గొని ఉండాలని.. మాస్టర్ వీవర్ వద్ద వర్కును ప్రారంభించిన తేదీని తెలియజేయాలని.. గత రెండేళ్లలో ఆన్‌లైన్లో వేతనాలు బదిలీ అయ్యాయని చూపాలని.. దీనికి సంబంధించి మాస్టర్ వీవర్ హామీ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుందని ప్రకటించారు.
● స్వతంత్రంగా పనిచేస్తున్న కార్మికులు మగ్గం తేదీని తెలియజేయాలి. రెండేళ్లుగా వీవర్.. లేదా జీఎస్టీ నంబర్ ఉన్న వ్యాపారి నుంచి నూలును కొనుగోలు చేసినట్లు చూపాలి. కొనుగోలు లేదా జీఎస్టీ నంబర్ ఉన్న బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది.
● వీవర్ నెలకు రూ.నాలుగు వేల విలువైన ఒక బండిల్ పత్తి నూలును కొనుగోలు చేసి ఉండాలి. సుమారు రూ.పది వేల విలువైన పట్టు నూలును వినియోగించి ఉండాలి.
● ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘం, మాస్టర్ వీవర్ వద్ద, స్వతంత్రంగా పనిచేసే వారు మూడు కేటగిరీలకు సంబంధించిన పత్రాలను అనుమతి పునరుద్ధరణ కోసం జిల్లా హ్యాండ్లూమ్ ఆఫీసర్ సిఫార్సు చేయాలి. ఈ రూల్స్ మేరకు చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే సడలించాలని డిమాండ్ చేస్తున్నారు.
వినతిపత్రమిచ్చినా ప్రయోజనమేదీ..?
పింఛన్లు ఎగ్గొట్టేందుకే ఇలాంటి రూల్స్‌ను తెరపైకి తీసుకొచ్చారని చేనేత సంఘ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మంగళగిరిలో చేనేత, వస్త్ర కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. వీటిని సడలిస్తామని హామీ ఇచ్చినా, దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేటికీ ఇవ్వలేదని పేర్కొంటున్నారు.
అలివి కాని నిబంధనలతో చేనేతల అగచాట్లు
50 ఏళ్లు దాటిన అర్హులైన
కార్మికుల నుంచి దరఖాస్తులు
మజూరీ, జీఎస్టీ, నూలు కొనుగోలు బిల్లులు సమర్పించాలంట..!
గతంలో సులభంగా మంజూరు
ఎగ్గొట్టేందుకే సరికొత్త రూల్స్
తెచ్చారంటున్న నేతలు
చేనేతలకు నూతనంగా పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించినా, సర్కార్ విధించిన అలివికాని నిబంధనలు వీరి పాలిట గుదిబండలా మారుతున్నాయి. 50 ఏళ్లు నిండిన అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి, సరికొత్త రూల్స్‌ను తెరపైకి తెచ్చి వీరిని ఇక్కట్లకు సర్కార్ గురిచేస్తోంది. గతంలో మగ్గం ఉంటే మంజూరు చేసేవారు. అయితే తాజాగా మజూరీ, జీఎస్టీ, నూలు కొనుగోలు బిల్లులను సమర్పించాలంటూ కొర్రీలు పెట్టారు. ఈ పరిణామాల క్రమంలో ఏమి చేయాలో పాలుపోక వీరు అయోమయానికి గురవుతున్నారు. పేరుకు ఇస్తామంటున్నా, ఎగ్గొట్టేందుకే ఇలాంటి వాటిని అమలు చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు.
చేనేత కార్మికులకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ఆయన సజీవంగా ఉన్నంత వరకు ఇది సక్రమంగా అమలైంది. తదనంతరం వచ్చిన పాలకులు దీన్ని తూతూమంత్రంగా అమలు చేసే అనేక మంది అర్హులకు ఆవేదనను మిగిల్చారు. ఈ తరుణంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేశారు. దీని ద్వారా మగ్గం నేసే కార్మికులకు పింఛన్లు వచ్చేవి. దీనికి గానూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వలంటీర్లకు దరఖాస్తులను సమర్పిస్తే సరిపోయేవి. ఆపై మరుసటి నెల నుంచే ఇవి లభించేవి. అయితే తాజాగా సచివాలయాల్లో ఈ నెల ఏడు నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.


