చంద్రబాబు కుతంత్రాలకు భయపడేది లేదు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుతంత్రాలకు భయపడేది లేదు

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కావలిలో పార్టీ శ్రేణులతో

ఆత్మీయ సమావేశం

కావలి: కుట్రలు, కుతంత్రాలు చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని, వీటికి తాము భయపడే ప్రసక్తేలేదని.. మొక్కవోని దీక్షతో ముందుకెళ్తామని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆరెస్సార్‌ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కావలి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనికి గానూ పటిష్టమైన ప్రణాళిక, పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించాల్సి ఉందని వివరించారు. సమరంలో ప్రత్యర్థుల్ని ఓడించి.. తమ పార్టీ విజేతలను అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముందు సగర్వంగా నిలబెట్టాలని కాంక్షించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి.. తన వారికి మేలు చేస్తున్న సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బూటకపు వాగ్దానాలతో అందలమెక్కడం.. ఆ తర్వాత విస్మరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీ పేరుతో దగాకు పాల్పడి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. అక్రమాలను ఆధారాలతో సహా తమ పార్టీ అధినేత నిరూపిస్తే, ఏమి చేయాలో చంద్రబాబు, లోకేశ్‌కు పాలుపోవడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువుఛాయలు కమ్ముకొని.. రైతులు కన్నీరు పెడుతుంటే వారిని ఆదుకునేందుకు సైతం సర్కార్‌ ఎలాంటి చర్యలను చేపట్టడంలేదని చెప్పారు. చంద్రబాబుకు మించిన షోలతో ప్రజలను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక రోడ్డును నిర్మించానంటూ, దాని చుట్టే తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరి సంగతిని ప్రజలు తేల్చనున్నారన్నారు. పార్టీ కావలి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కానుందని వివరించారు.

విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు తన అనుచరులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నాటకాలాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ శ్రేణలను బెదిరించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం రానున్న శాసనసభ ఎలక్షన్లలో గెలుపునకు తొలి మెట్టు అని చెప్పారు. ఏకగ్రీవాలకు తావివ్వొద్దని కోరారు. జగనన్న, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

పింఛన్ల పేరుతో కొత్త నాటకం

స్థానిక పోరు సమీపిస్తున్న తరుణంలో పింఛన్ల పేరుతో కొత్త నాటకానికి చంద్రబాబు తెరలేపారని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బీసీ, ఎస్సీలకు 50 ఏళ్లకే పింఛన్లను ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు, దాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇస్తామంటూ.. ఎన్నికల కోడ్‌ కారణంగా అందించలేకపోయామంటూ తప్పించుకునేందుకు యత్నిస్తారని విమర్శించారు.

ఐడీ కార్డుల అందజేత

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఐడీ కార్డులను కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు అందజేశారు. తొలుత సమావేశానికి విచ్చేసిన వీరికి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆఫ్కాఫ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు అనిల్‌, విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement