కలువాయికి చెందిన గంటా వాసు, కృష్ణవేణి దంపతుల కుమార్తె కీర్తన. పుట్టుకతోనే శారీరక లోపంతో ఈమె జన్మించారు. అంగవైకల్యంతో బాధపడుతున్నా, కొత్తగా పింఛన్‌ను మంజూరు చేయలేదు. దీని కోసం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేసినా కనికరం చూపే వారే కరువయ్యారు. ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యేకు వినతిపత్రమిచ్చి, నిరీక్షించినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. జిల్లా ఉన్నతాధికారులైనా కరుణిస్తారేమోనని వీరు ఆశిస్తున్నారు.
నెల్లూరులోని జెండావీధికి చెందిన రెహనాబేగానికి రెండు కాళ్లు లేవు. ట్రైసైకిల్‌పై ఆధారపడి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పింఛన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా, దీనికి సంబంధించిన రసీదును ఇవ్వలేదు. మరోసారి చేసుకోవాలో.. లేదో తెలియక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య వీరి ఒక్కరిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఎందరో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు(పొగతోట): టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ 27 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్‌ను సైతం మంజూరు చేయలేదు. ఫలితంగా అర్హతున్న ఎంతో మంది ఎప్పటికై నా ఈ సర్కార్ కనికరించదానని నిరీక్షించారు. చివరికి ఏదో ఇస్తున్నామని ప్రకటించడంతో వీరిలో ఆశలు చిగురించాయి. అయితే ఇక్కడే అసలు చిక్కులు మొదలయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక సచివాలయాల వద్ద కొందరు సొమ్మసిల్లి పోతుండగా, మరికొందరు పడరాని పాట్లు పడుతున్నారు.
సాకులు చూపుతూ పంగనామం
సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనను తాజాగా విధించారు. అయితే అక్కడ సర్వర్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు పనిచేస్తుందో తెలియక ఎంతో మంది మంది ఉదయం నుంచే నిరీక్షించాల్సి వస్తోంది. వాస్తవానికి ఇది పనిచేస్తే వివిధ రకాల సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, పదెకరాలకుపైగా భూములు, ఆదాయ పన్ను.. ఇలా వివిధ కొర్రీలను తెరపైకి తెచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాన్నే దూరం చేస్తున్నారు. అప్లయ్ చేసుకునేందుకు ఇచ్చిన సమయమే తక్కువని, ఈ తరుణంలో కొర్రీలు విధించి తమకు అంతులేని శోకాన్ని మిగిలిస్తున్నారనే ఆవేదన పలువురిలో వ్యక్తమవుతోంది.
ఇంటి పన్ను కడితేనేనంట..!
ఇంటి పన్నును చెల్లించామనే రసీదును అప్‌లోడ్ చేస్తేనే నూతనంగా మంజూరు చేస్తామనే నిబంధనను సర్కార్ తీసుకొచ్చింది. నిజానికి పింఛన్లు పొందే వారిలో అత్యధికులు పేదవారే. వీరిలో ఎక్కువ మంది పూరి గుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. పన్ను పరిధిలోకి రాని తాము వీటిని ఎక్కడ్నుంచి తీసుకురావాలని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇవ్వాలనే ఉద్దేశం లేకపోతే స్పష్టంగా చెప్పాలే గానీ, ఇలాంటి వాటితో తమనెందుకు కష్టాలకు గురిచేస్తున్నారని వీరు ప్రశ్నిస్తున్నారు.
గడువు తక్కువ.. ఆ మధ్యలో సెలవులు
పీజీఆర్‌ఎస్, ఎంపీడీఓల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం గతంలో ఉండేది. అయితే వీరు మరోసారి దరఖాస్తు చేయాలా.. వద్దాననే అంశమై అధికారుల నుంచి స్పష్టత కొరవడింది. మరోవైపు కొత్తగా కావాలనుకునే వారు దాఖలు చేసుకునేందుకు ఈ నెల ఏడు నుంచి 16 వరకు అవకాశం కల్పించారు. పేరుకు పది రోజుల సమయమిచ్చినా, ఇందులో రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులొస్తాయి. ఇక మిగిలిన ఏడు రోజుల్లో ఎంత మంది నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ఎంత మందికి ఇస్తారో దేవుడికే ఎరుక.
అందుబాటులో ఉన్న బడ్జెట్ మేరకేనా..?
అర్హులందరికీ ఇస్తామని ప్రభుత్వం పైకి చెప్తున్నా, అదంతా బూటకమేననే వాదనా లేకపోలేదు. అందుబాటులో ఉన్న బడ్జెట్ మేరకే కేటాయిపులుంటాయనే టాక్ అధికారుల్లోనే నడుస్తోంది. మరోవైపు పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. వీరిలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, కల్లుగీత, చేనేత కార్మికులు తదితరులున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు వీరు పెద్ద ఫీట్లే చేయాల్సి వస్తోంది.
కొత్తగా మంజూరు చేస్తామంటూ ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం
అయితే పట్టపగలే
చుక్కలు చూపిస్తున్న వైనం
సాంకేతిక సమస్యలతో సతమతం
సచివాలయాల వద్ద తప్పని నిరీక్షణ
దరఖాస్తు దాఖలుకు అర్హుల పాట్లు
అందరికీ మంజూరు కష్టమే..
పింఛన్లు పొందే విషయంలో అర్హులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకూడదని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఆయన ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఎంతో ఊరటనిచ్చింది. ఆ సమయంలో అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా.. అర్హుల ఇళ్ల నుంచే దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు అప్‌లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఫలితంగా అంతా సజావుగా జరిగి, మరుసటి నెల నుంచే పింఛన్లను అందుకునేవారు. దీంతో ఎంతో మంది సంతోషంగా ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సీఎం చంద్రబాబు తన మార్కు రాజకీయాలకు పదును పెట్టి వలంటీర్ వ్యవస్థనే ఎత్తేశారు. ఫలితంగా నాటి నుంచి దరఖాస్తు చేసుకోవాలంటే ఓ యుద్ధమే చేయాల్సిన పరిస్థితిని సర్కార్ తీసుకొచ్చింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.


