● అసైన్డ్ భూములపై అక్రమార్కుల కన్ను
● రీ సర్వే తర్వాత వెలుగులోకి వస్తున్న బాగోతాలు
● రెవెన్యూ యంత్రాంగం పాత్రపై
అనుమానాలు
● రూ.లక్షల్లో చేతులు మారాయనే
ఆరోపణలు
సీతారామపురం: మారుమూల అటవీ ప్రాంతమైన దేవమ్మ చెరువు పంచాయతీలో గల అసైన్డ్ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. స్థానికంగా ఉండే పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ ల్యాండ్స్‌ను రెవెన్యూ యంత్రాంగం పరులపరం చేసింది. ఇతర జిల్లాల్లోని వారి పేర్లతో ఆన్‌లైన్లో నమోదు చేయడంతో గుట్టురట్టయింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ఎకరానికి రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాయాజాలం
దేవమ్మ చెరువులో గతేడాది నవంబర్‌లో రీ సర్వేను చేపట్టారు. దీనికి ముందు సర్వే నెంబర్ 1 – 2లో 10.. 3 – 4లో మూడు.. 89 – 4లో 8.. 89 – 5లో ఐదు.. 91 – 1లో 15.. 92 – 1లో 8.. 93 – 1లో 8.. 82 – 1లో మూడెకరాల మేర 60 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉండింది. అయితే ఇందులో 20 ఎకరాలను స్థానికేతరుల పేర్లతో రీ సర్వే తర్వాత నమోదు చేశారు. దీంతో మాయాజాలం బయటపడింది.
ఇదీ తంతు..
దేవమ్మ చెరువు రెవెన్యూ సర్వే నంబర్ 89 – 5, 82 – 1, 89 – 4, 1 – 2, 91 – 1, 92 – 1, 93 – 1లో స్థానికేతరులతో పాటు అనర్హులైన రాజమ్మ (0.70), రజని (1.25), సుజాత (1), రామలక్ష్మమ్మ (1.93), కవిత (1), వెంకటేశ్వర్లు (1), కొండమ్మ (0.54), గంగాభవాని (1), వెంకటలక్ష్మమ్మ (1), కవిత (1), పాపరాజు (1), మానస (1), దేవి (0.97), లక్ష్మీకుమారి (0.97), వెంకటసుబ్బమ్మ (1.12), మౌనిక (1.12), డేనియల్ (1.89), సుబ్బరతమ్మ (1.02), బ్రహ్మయ్య (3) వంటి వారి పేర్లపై సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమిని ఆన్‌లైన్లో ఎక్కించారు. మరోవైపు దీన్ని సెటిల్మెంట్ భూమిగా మార్చి రూ.లక్షలకు ఓ వ్యక్తి విక్రయించారని సమాచారం. సర్వే నంబర్ 8, 60 – 3, 18 – 4 – 47లో కాశయ్య, బాలయ్య, వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు పేర్లపై గల సుమారు ఏడెకరాలకు పైగా అసైన్డ్ భూమిని ఇతరుల పేరుపై సెటిల్మెంట్ భూములుగా మార్చారని తెలుస్తోంది.
కొందరి పేర్లు మాయం
2005 – 08 మధ్య సర్వే నంబర్ 1లో 77 – 99 వరకు బ్లాకులుగా విభజించి కమిటీ తీర్మానంతో 31 మంది ఎస్టీలకు 62 ఎకరాలను పంపిణీ చేసి పాస్‌పుస్తకాలు, పట్టాలను అందజేశారు. 2010లో అప్పటి ప్రభుత్వం బోర్లు వేయించి సాగుకు సిద్ధం చేశారు. ప్రస్తుతం 19 మంది పేర్లే ఆన్‌లైన్లో కనిపిస్తుండగా, మిగిలిన 12 మందివి కానరావడంలేదు. సంబంధిత సర్వేయర్, వీఆర్వోలు ప్రత్యేక చొరవతో పట్టాలున్న వారి భూములను ఇతరుల పేర్లతో ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నారనే అంశమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. 2025 నుంచి సర్వే నంబర్ 39, 84, 47, 85 తదితరాల్లో మిగులు భూమిని స్థానికేతరుల పేర్లపైకి ఎక్కించారనే ఆరోపణలూ ఉన్నాయి. కలెక్టర్ స్పందించి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మా భూమిని ఇతరుల పేర్లపైకెక్కించారు
నా తండ్రి వెంకటసుబ్బయ్య పేరుపై ఇనాం భూమి 2.56 ఎకరాలను 1989లో దేవమ్మ చెరువు సర్వే నంబర్ 18 – 4లో ఇచ్చారు. నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూమిని 15 రోజుల క్రితం ఇతరుల పేర్లపై ఆన్‌లైన్లో నమోదు చేశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించినా, ప్రయోజనం కరువైంది.
– కమతం సుబ్రహ్మణ్యం
రీ సర్వేకు ముందున్న
పేరు ఇప్పుడు లేదు
దేవమ్మ చెరువు గ్రామ సర్వే నంబర్ 91 – 1లో రెండెకరాల అసైన్మెంట్ భూమిని 2005లో కేటాయించి నా పేరుపై పట్టా పాస్ పుస్తకాలను సైతం ఇచ్చారు. రీ సర్వే తర్వాత వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తిపై నా భూమిని మార్చి ఆన్‌లైన్లో అతని పేరుపై నమోదు చేసి ఉన్నారు. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే, ఏవేవో చెప్తున్నారు. – గాయపు నాగయ్య


