● ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. ఈ క్రమంలో ఎలక్షన్ల నిర్వహణకు సంబంధించిన చర్యలను రాష్ట్ర ఎన్నికల అధికారులు చేపట్టారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉపక్రమించారు. ఫొటోతో ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రచురించనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాలను ఈ నెల 14న గుర్తించాల్సి ఉంది. దీని వివరాలను 15న ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులను 15, 16న స్వీకరించాల్సి ఉంది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను 16న, జిల్లా ఎన్నికల అధికారి గుర్తించిన పోలింగ్ కేంద్రాలకు 18న అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆపై వివరాలను 19న వెల్లడించాలి. నూతన జెడ్పీ యాజమాన్య పరిధి మేరకు ఎన్నికల జరగనున్నాయి. జెడ్పీ పరిధిలోకి 35 మండలాలు రానుండటంతో ఆ మేరకు జరపనున్నారు.
అక్రిడిటెడ్ జర్నలిస్టుల
పిల్లలకు ఫీజుల్లో రాయితీ
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న అక్రిడిటేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీని కల్పించాలనే ఉత్తర్వులను కలెక్టర్ హిమాన్షు శుక్లా జారీ చేశారని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత అసోసియేషన్ల నుంచి పొందాలని కోరారు. ఫీజు రాయితీని పొందేందుకు గానూ 2025 – 26కు సంబంధించిన అక్రిడిటేషన్, తల్లిదండ్రుల ఆధార్‌కార్డులు, పేర్లు, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, విద్యార్థి పేరు, చదువుతున్న పాఠశాల, చిరునామా, తరగతి, అడ్మిషన్ నంబర్‌ను దరఖాస్తుతో పాటు జత చేయాలని కోరారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు దరఖాస్తులపై ఎంఈఓ.. ఆరు నుంచి పదో తరగతి వరకు డిప్యూటీ డీఈఓలు కౌంటర్ సంతకాలు చేయాలని సూచించారు.
బ్యాంక్ సేవలకు
నాలుగు రోజులు బ్రేక్
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆలిండియా బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు సమ్మెలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం పాల్గొననున్నారు. ఆపై రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా సోమవారం వరకు బ్యాంకులు పనిచేయవు. దీంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకునే ప్రమాదముంది. ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అవసరమైన నగదును సిద్ధంగా ఉంచుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
17న జెడ్పీ సర్వసభ్య సమావేశం
నెల్లూరు(పొగతోట): నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 17వ తేదీ ఉదయం 10.30కు నిర్వహించనున్నామని సీఈఓ వసుమతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో డ్వామా, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, గృహ నిర్మాణ తదితర శాఖలతో సమీక్షించనున్నారని చెప్పారు. జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 71,297 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,783 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.5.59 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


