క్వార్ట్‌జ్‌ అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

క్వార్ట్‌జ్‌ అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులు

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

నెల్లూరు రూరల్‌: క్వార్ట్‌జ్‌ అక్రమాలకు సంబంధించి తాను ఆధారాలను బయటపెట్టి ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా.. ఇతరులతో మాట్లాడించి పక్కదారి పట్టించడం.. అడ్డమైన కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రశాంతంగా ఉండకుండా, ఫ్యాక్షన్‌ సంస్కృతిని తీసుకొచ్చారంటే కేవలం డబ్బు అహంకారమే కారణమని విమర్శించారు. తనను బెదిరించేందుకు తన అనుచరుడు శ్రావణ్‌ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. టీడీపీకి చెందిన వ్యక్తిని బెదిరించారంటూ శ్రావణ్‌పై కేసు పెట్టారని, అయితే దీనికి సంబంధించిన ఆధారాల్లేవని స్పష్టం చేశారు. దొంగ కేసులకు తాము భయపడేదిలేదని తేల్చిచెప్పారు. జిల్లాలోని రాజకీయ నాయకుల మధ్య గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు జరిగినా, ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి లేదని, కొత్తగా ఈ తరహా పద్ధతిని తీసుకొచ్చింది వీరేనని మండిపడ్డారు. మీడియాలో వచ్చే కథనాలను హుందాగా తీసుకోవాలని, వాటిపై దాడులకు పాల్పడతామని హెచ్చరించడం సరికాదని హితవు పలికారు. తమపై దొంగ కేసులు పెట్టి వేధించడం కాకుండా శాంతిభద్రతలపై దృష్టి సారించాలని ఎస్పీకి సూచించారు. 2029లో వేమిరెడ్డి దంపతులు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని.. డబ్బుతో వచ్చిన అహంకారం, పొగరును తగ్గిస్తామన్నారు. తనను అంతం చేసేందుకు యత్నించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు శ్రావణ్‌ అత్యంత నమ్మకమైన వ్యక్తి అని చెప్పారు. డబ్బుతో టీడీపీని కొనుగోలు చేయగలరేమో గానీ తమనేమీ చేయలేరని వ్యాఖ్యానించారు. సామాజిక సేవ విషయంలోనూ వేమిరెడ్డి కుటుంబం డబ్బాలు కొట్టుకుంటోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement