కానరాని ఆర్మీ జవాన్ ఆచూకీ
● కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన
● రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు
వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యమై నెల రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 18 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న రవి ఇటీవల మణిపూర్ నుంచి జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో 30 రోజుల సెలవుపై స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే అదృశ్యమయ్యాడు. ఇంఫాల్ నుంచి బెంగళూరుకు విమాన టికెట్ బుక్ చేసుకోగా అది రద్దయింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశాడు. అనంతరం జూలై 19వ తేదీన న్యూ జల్పాయ్‌గురి రైల్వేస్టేషన్‌కు చేరుకుని గువహాటి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్సెమ్వీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. అదేరోజు సాయంత్రం 6:30 గంటలకు భార్య ఫోన్ చేయగా.. ‘టీటీ వస్తున్నారు.. తర్వాత మాట్లాడతాను’ అంటూ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ రవి స్పందించలేదు.
జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు
బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎక్కడా సమాచారం లభించకపోవడంతో జూలై 23వ తేదీన వరికుంటపాడు పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజు ఎస్సై మధుసూదన్‌రావు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రవి ఆచూకీ కోసం పలువురు ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులు కలిసి వినతిపత్రాలు అందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అర్జీ ఇవ్వగా సంబంధిత భద్రక్ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలను తెలియజేశారు. ఒడిశా గవర్నర్‌కు కూడా ఫోన్ ద్వారా జవాన్ మిస్సింగ్ విషయాన్ని వివరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్లతో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జవాన్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో వరికుంటపాడు, కావలి వన్‌టౌన్ ఎస్సైల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పలు ప్రాంతాలను జల్లెడ పట్టినా రవి ఆచూకీ మాత్రం లభించలేదు.
కుటుంబ సభ్యుల అనుమానాలు
2009లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో తోటలచెరువుపల్లి గ్రామంలో సుమారు ఐదెకరాల భూమిని పట్టా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఆ భూమిలో రవి వ్యవసాయం చేసి జామాయిల్ పంట వేశాడు. ఈ భూమి విషయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఫోన్ చేయడం, మెసేజ్‌లు చేయడం జరిగింది. ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయని కూడా జవాన్ భార్య వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి విషయమై రవి అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది.


